బాలకృష్ణ, గోపీచంద్.. ఒకరి సినిమా ఒకరికి


బాలకృష్ణ, గోపీచంద్.. ఒకరి సినిమా ఒకరికి
బాలకృష్ణ, గోపీచంద్.. ఒకరి సినిమా ఒకరికి

ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణంగా జరిగే విషయమే. ఒక హీరో కథ విన్నాడంటే అది కచ్చితంగా చేస్తాడని అర్ధం కాదుగా. ఒకవేళ నచ్చకపోతే అది వేరే హీరో దగ్గరకి వెళ్లడం సర్వసాధారణం. అలా ముందుగా ఒక హీరో వద్దకు వెళ్లిన కథలు వేరే హీరోలు చేయడం గతంలో మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. అయితే ఇద్దరు హీరోలు.. ముందుగా ఒకరి గురించి చెప్పిన కథలు ఇంకొకరు చేయడం, అది కూడా చాలా తక్కువ సమయంలో జరగడం అనేది చాలా విశేషమని చెప్పాలి. ఆ ఇద్దరు హీరోలు గోపీచంద్, బాలకృష్ణ కాగా.. ఆ సినిమాలు ఏమిటన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

పరుచూరి మురళి గతంలో గోపీచంద్ తో ఆంధ్రుడు సినిమా తీసాడు. ఆ సినిమా బాగానే ఆడింది. అదే చనువుతో లాస్ట్ ఇయర్ గోపీచంద్ వద్దకు మురళి రూలర్ కథ తీసుకెళ్లి చెబితే అది వర్కౌట్ కాలేదు. తిరిగి తిరిగి అది బాలకృష్ణ వద్దకు చేరింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద ప్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ప్రస్తుతం గోపీచంద్ సీటిమార్ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత తేజ దర్శకత్వంలో అలివేలు వెంకట రమణ సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ కథను తేజ ముందుగా బాలకృష్ణకు వినిపించాడట. కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ చేయకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు గోపీచంద్ వద్దకు చేరింది.

మరి గోపీచంద్ వద్దనుకున్న కథతో బాలయ్యకు ప్లాప్ పడింది. మరి బాలయ్య వద్దనుకున్న కథతో గోపీచంద్ కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం.