బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే


బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే
బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కసితో రగిలిపోతున్నాడు. ఎలాగైనా భారీ హిట్ ను సొంతం చేసుకుని తన పనైపోలేదని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇందుకోసం తనకు రెండు భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో జతకట్టాడు బాలయ్య. గతేడాదే లాంచ్ అయిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల షూటింగ్ మొదలు కాలేదు. బడ్జెట్ ను తిరిగి సమీక్షించుకోవడం, స్క్రిప్ట్ లో మార్పులు వంటి పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. చూస్తుంటే ఇప్పుడు అన్ని పనులు పూర్తయినట్లు సమాచారం అందుతోంది.

మార్చ్ 2 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోనే షూటింగ్ మొదలవుతుంది. సెకండ్ షెడ్యూల్ నుండి అవుట్ డోర్ షూటింగ్ ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రం గురించి అనేక రూమర్లు షికార్లు చేసాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ రెండు పాత్రలు కూడా కవలలు అని చెబుతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్ర ఇంటర్వెల్ సమయానికి ఎంట్రీ ఇస్తుందిట. అక్కడినుండి సెకండ్ హాఫ్ అంతా కీలకంగా బాలయ్య అఘోర పాత్ర ఉంటుందంటున్నారు.

అలాగే ఫస్ట్ హాఫ్ లో బాలయ్య రైతుల సమస్యలపై ఉద్యమిస్తాడట. ఆ ప్రయత్నాల వల్ల విలన్లతో ఢీకొట్టే పరిస్థితి వస్తుంది. అదే కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని తెలుస్తోంది. అంజలి ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. మరో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. ఇప్పటికే థమన్ ట్యూన్స్ అందించే పని కూడా మొదలుపెట్టేశాడు. ఈ సినిమాలో బాలయ్య పాత సాంగ్ స్వాతిలో ముత్యమంత ను తనదైన శైలిలో థమన్ రీమిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట బాలకృష్ణ, అంజలిలపై చిత్రీకరించనున్నారు. దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.