పవన్ కళ్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ


పవన్ కళ్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ
పవన్ కళ్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ

కెరీర్ మొదలైన ఇన్నేళ్లకు బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టాడు. అవ్వడానికి రీమేక్ అయినా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ హిట్ చాలా అవసరం. రాక్షసుడు సినిమా హిట్ తర్వాత వరసపెట్టి సినిమాలు చేసేస్తాడు అనుకుంటే చాలా గ్యాప్ తీసుకుని సంతోష్ శ్రీనివాస్ తో సినిమాను ప్రకటించాడు. కందిరీగ సినిమాతో విజయాన్ని అందుకున్న సంతోష్ శ్రీనివాస్, ఆ తర్వాత ఎందుకనో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. వరస వైఫల్యాల తర్వాత చాలా కాలం సినిమాలు చేయని ఈ దర్శకుడు, ఇప్పుడు బెల్లంకొండతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈరోజు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ పలు విషయాలపై స్పందించాడు. అందులో భాగంగా ఇప్పుడు తను చేస్తోన్న సినిమాపై వస్తోన్న రూమర్స్ కు స్పందించాడు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుండి ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్ అనే ప్రచారం సాగుతోంది. నిజానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ హీరోగా తేరి రీమేక్ అనౌన్స్ అయింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దయింది. ఇప్పుడు అదే సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండతో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు అందరూ పవన్ తో చేయాల్సిన సినిమాను ఇప్పుడు ఈ యువ హీరోతో చేస్తున్నాడని గుసగుసలాడారు.

ఈ వార్తలపై స్పందించిన బెల్లంకొండ, తాను చేస్తోన్న చిత్రం దేనికి రీమేక్ కాదని, ఇది పూర్తిగా ఒక కొత్త కథ. రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఇంకా తన తర్వాతి సినిమాల విషయంలో స్పందిస్తూ, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయనున్నట్లు తెలిపాడు. అయితే దానికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ రెండు చిత్రాలకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.