భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ


భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీనివాస రెడ్డి, షకలక శంకర్, సత్య, వెన్నెల కిషోర్, చిత్రం శ్రీను, రచ్చ రవి, సత్యం రాజేష్, రఘుబాబు, ప్రవీణ్ తదితరులు
నిర్మాత-దర్శకత్వం: వై. శ్రీనివాస రెడ్డి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే: పరమ్ సూర్యాన్షు
సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరణ్
సంగీతం: సాకేత్ కొమాండూరి
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
రిలీజ్ డేట్: డిసెంబర్ 6
రేటింగ్: 2/5

కమెడియన్ గా తనదైన శైలిలో అందరినీ నవ్విస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న శ్రీనివాసరెడ్డి అడపాదడపా హీరోగా కూడా రాణించాడు. అయితే తొలిసారి హీరోతో పాటు నిర్మాతగా, దర్శకుడిగా మారి చేసిన చిత్రం భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. మరి బోలెడంత కామెడియన్లతో మంచి రసగుల్లా వంటి సినిమాగా ప్రమోట్ చేయబడ్డ ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:
శ్రీను (శ్రీనివాస రెడ్డి) నటుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. తనని యూట్యూబ్ లో పెద్ద స్టార్ ను చేస్తానని చెప్పి డబ్బులు దొబ్బుతుంటాడు రఘుబాబు. శ్రీనుకి ఇద్దరు స్నేహితులు జోజో (సత్య) – పీటర్ (షకలక శంకర్). శ్రీనుకి లాటరీ టిక్కెట్లు కొనే మరో అలవాటు కూడా ఉంది. ఒకరోజు 2 కోట్లు విలువ చేసే లాటరీ గెలుచుకుంటాడు శ్రీను. అయితే సమయానికి ఆ టికెట్ మిస్ అవుతుంది. అది ఎటెళ్లిపోయింది? ఎవరైనా కాజేశారా? మరోవైపు ఈ ముగ్గురి జీవితాల్లోకి జర్నలిస్ట్ అయిన కోకిల రావడం వల్ల ఎటువంటి మలుపులు తిరుగుతుంది. వీళ్లకు డ్రగ్ డీలర్ కోబ్రా (చిత్రం శ్రీను)లకు సంబంధం ఏంటి? ఈ కథలో స్వతంత్ర కుమార్ (వెన్నెల కిషోర్)కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం పెద్ద తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:
శ్రీనివాస రెడ్డికి అంత పరీక్ష పెట్టే పాత్రేమీ కాదిది. చాలా సులువుగా శీను అనే పాత్రను చేసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇందులో మరుపులేమి లేకపోవడంతో తన పాత్ర హైలైట్ అవ్వదు. ఉన్నంతలో వెన్నెల కిషోర్ కొంత నవ్విస్తాడు. రామ్ గోపాల్ వర్మ తరహాలో వెన్నెల కిషోర్ పెట్టే హావభావాలు నవ్వులు తెప్పిస్తాయి. షకలక శంకర్ బతుకు ఎడ్ల బండి ఎపిసోడ్ లో చెలరేగిపోయాడు. 5 నిమిషాల పాటు బాగా నవ్విస్తాడు. అలాగే సత్య కూడా రసగుల్లా ఎపిసోడ్ లో తన హావభావాలతో నవ్వులు పూయిస్తాడు. మిగిలిన వాళ్లంతా షరా మాములుగా. తమకు అలవాటైన పద్దతిలో చేసుకుంటూ వెళ్లిపోయారు.

సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ఫోకస్ మిస్ అవుతుంది. యాంగిల్స్ కూడా కొన్ని భిన్నంగా ఉంటాయి. ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్లో గా సినిమా సాగుతోందా లేదా అనే డౌట్ ప్రేక్షకుడికి వచ్చిందంటే అది కచ్చితంగా ఎడిటర్ వైఫల్యమే. సంగీతం సో సో గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మనం రోజూ ట్రోల్స్ పేజెస్ లో వాడే సౌండ్స్ నే ఇక్కడ కూడా వాడేశారు. కొత్త సౌండ్స్ అస్సలు వినిపించవు. కథ చాలా పలచునైనది ఎంచుకున్నారు. పోనీ స్క్రీన్ ప్లే తో ఏదైనా మాయ చేసారా అంటే అదీ లేదు. అటు స్పూఫ్ సినిమాగానూ కాక, ఇటు కామెడీ ఎంటర్టైనర్ గానూ కాక, లేక సీరియస్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగానూ కాక, భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు ఎటూ కాకుండా పోతుంది. స్క్రీన్ ప్లేలో తట్టెడు లోపాలు కనిపిస్తాయి. చాలా చోట్ల లాజిక్ అనే మాటకు అర్ధమే తెలీదన్నట్లుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. ఇక డైలాగులు కొన్ని చోట్ల ప్రాస కోసం ప్రాకులాడితే, కొన్ని చోట్ల ఈ మధ్య ట్రెండ్ అవుతున్న కొన్ని సంఘటనలలోని డైలాగులను వాడుకున్నారు. అయితే వీటిలో చాలా భాగం వర్కౌట్ కాకపోవడం విచారకరం. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం యావరేజ్ గా ఉంది. కథ, స్క్రీన్ ప్లే ప్రధాన వైఫల్యాలు కావడంతో శ్రీనివాస రెడ్డి కూడా ఏమి చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

విశ్లేషణ:
ఏదైనా సినిమా తీసేటప్పుడు ఏ ఉద్దేశంతో సినిమా తీస్తున్నామన్న క్లారిటీ ఆ టీమ్ కు కచ్చితంగా ఉండాలి. సినిమా తీయాలి కాబట్టి ఏది తోస్తే అది తీసుకుంటూ వెళ్లిపోదామంటే ఇలానే అటూ ఇటూ కాకుండా పోతుంది. సినిమా తీసినప్పుడు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఈ తప్పు వల్ల ప్లాప్ అయిందన్న క్లారిటీ ఫిల్మ్ మేకర్ కు రావాలి. అసలు ఈ సినిమాను ఏ ఉద్దేశంతో తీస్తున్నారో కచ్చితంగా భాగ్యనగర వీధుల్లో టీమ్ కు లేకుండా పోయింది. కొన్నిసార్లు కామెడీ ఎంటర్టైనర్ లా అనిపిస్తే, కొన్ని సార్లు స్పూఫ్ మూవీలా తోస్తుంది. లాజిక్ లు పట్టించుకోకూడదు అనుకుంటే మధ్యలో మెసేజ్ ఓరియెంటెడ్ కూడా వస్తుంది. ఇలా ఏం తీయాలో క్లారిటీ లేని సినిమాగా భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు నిలిచిపోతుంది. దర్శకుడిగా, నిర్మాతగా శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఫెయిల్ అయిన చిత్రమిది.

చివరిగా: భాగ్యనగర వీధుల్లో అయోమయం