ఆ విషయంలో శర్వానంద్ కంటే ముందే నితిన్..


ఆ విషయంలో శర్వానంద్ కంటే ముందే నితిన్..
ఆ విషయంలో శర్వానంద్ కంటే ముందే నితిన్..

వరసగా సినిమాలు నిర్మితమవుతున్నప్పుడు ఒక సినిమా కాన్సెప్ట్ కు దగ్గర్లో మరో సినిమా కాన్సెప్ట్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఇలా జరిగింది. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా టాలీవుడ్ లో చాలా కామన్ గా జరిగే వ్యవహారం. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమా, నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమాల్లో ఒకేరకమైన కాన్సెప్ట్ లు ఉన్నాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

జాను చిత్రంతో ప్లాప్ అందుకున్న శర్వానంద్ చేస్తున్న తాజా చిత్రం శ్రీకారం. ఈ సినిమాలో శర్వానంద్ ఉన్నత చదువులు చదివి వ్యవసాయం వృత్తిగా స్వీకరించే వ్యక్తిగా కనిపిస్తాడు. యువతరానికి ఎంతో స్ఫూర్తి కలిగించేలా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. చాలా సీరియస్ గా సాగే ఈ కథలో సేంద్రీయ వ్యవసాయం గురించి పెద్ద చర్చే ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ తోనే నితిన్ రూపొందించిన చిత్రం విడుదలకు సిద్ధమైంది.

వరసగా మూడు ప్లాపుల తర్వాత నితిన్ చేస్తున్న చిత్రం భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సరదాగా సాగిపోయే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇందులో నితిన్ సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గా కనిపిస్తే, రష్మిక అతని బాస్ గాకనిపించనుంది. పూర్తిగా కార్పొరేట్ తరహాలో సాగిపోయే ఇలాంటి కథలో కూడా సేంద్రీయ వ్యవసాయం టాపిక్ ఉంటుందని తెలుస్తోంది. అసలు ఇదే చిత్రాన్ని కీలక మలుపు తిప్పుతుందని సమాచారం. సినిమాలో బేసిక్ కథ దీని చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు.

అయితే ఏదైనా విషయాన్ని కొత్తగా చెబుతుంటేనే ప్రేక్షకుడికి ఆసక్తి ఉంటుంది. భీష్మ లో ఈ అంశాన్ని టచ్ చేస్తున్నప్పుడు శ్రీకారం సినిమాలో మళ్ళీ ఇదే చెబుతున్నారేంటి అనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగినా కలగొచ్చు. నితిన్ లానే శర్వానంద్ కూడా ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు. తనకు కూడా హిట్ చాలా అవసరం. అయితే ఈ కాన్సెప్ట్ ముందే వచ్చేయడం వల్ల శర్వానంద్ కు ఏమైనా నష్టం ఉంటుందేమో చూడాలి. శ్రీకారం జూన్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.