భీష్మ రిలీజ్ విషయంలో తప్పు చేస్తున్నారా?


Bheeshma Releasing in off season can be a Setback
Bheeshma Releasing in off season can be a Setback

హ్యాట్రిక్ ప్లాపుల తర్వాత యంగ్ హీరో నితిన్ కొన్ని నెలల గ్యాప్ తీసుకుని వరస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఒకటికి అయిదు సినిమాలకు కమిటయ్యాడు నితిన్. బహుశా నితిన్ అంత బిజీగా ప్రస్తుతం ఏ నటుడూ లేడేమో. 2021 వేసవి వరకూ నితిన్ డైరీ ఖాళి లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం భీష్మ పూర్తి చేసే బిజీలో ఉన్నాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకీ కుడుముల నుండి రెండో ప్రయత్నంగా వస్తున్న చిత్రమిది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 20కి విడుదల చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే వెంకీ అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయలేకపోతుండడంతో ఏ మాత్రం బిజీ లేని ఫిబ్రవరి 21కి విడుదలను షిఫ్ట్ చేసారు. ఎందుకంటే జనవరి అంతా సంక్రాంతి సినిమాలు, రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలయ్యే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఎవరూ బుక్ చేసుకోలేదని ఫిబ్రవరి 21 మీద కర్చీఫ్ వేశారు. మహాశివరాత్రి సెలవు ఈ చిత్రానికి కలిసొస్తుందని వాళ్ళ నమ్మకం.

గతంలో చూసుకుంటే ఫిబ్రవరిలో కొన్ని హిట్లు ఉన్నా కానీ ఆ నెల పెద్దగా టాలీవుడ్ కు కలిసి రాదనే చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పరీక్షల సీజన్ కావడంతో సినిమాలకు మహారాజా పోషకులైన యూత్ పెద్దగా థియేటర్లవైపు రాని పరిస్థితి. అసలే రిపీట్ వేల్యూ లేక ఎక్కువ కాలం థియేటర్లలో సినిమా ఆడించలేని పరిస్థితిలో ఈ నెలలో సినిమా విడుదల చేస్తే ఎలా అంటూ బయ్యర్లు వాపోతున్నారు. అలా అని భీష్మ ఏమీ తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కూడా కాదు.

ఈ చిత్రానికి పాతిక కోట్ల వరకూ బిజినెస్ జరుగుతుందని అంచనా, మరి ఇంత బిజినెస్ ను ఆఫ్ సీజన్ లో విడుదల చేస్తే పెట్టుబడి తిరిగి రాబట్టగలదా అన్నది ఆలోచించుకోవాలి. అందుకే మరో రెండు నెలలు విడుదల వాయిదా వేసి ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగు ఏప్రిల్ లో ఒకటీ అరా సినిమాలు తప్ప ఏవీ ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు.

గతంలో నితిన్ నటించిన ఇష్క్ ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. అలాగే వెంకీ కుడుముల మొదటి చిత్రం ఛలో కూడా ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. ఈ సెంటిమెంట్ కలిసొస్తుందని ఫిబ్రవరి రిలీజ్ అనుకుంటున్నారేమో, భీష్మకు జరిగిన బిజినెస్ లో సగం కూడా ఈ రెండు సినిమాలకు జరగలేదు. అందుకే ఈ రెండు త్వరగా ప్రాఫిట్స్ లోకి వచ్చేసాయి. మరి భీష్మ విషయంలో సెంటిమెంట్ వర్కవుటై సూపర్ హిట్ అవుతుందా లేక ఆఫ్ సీజన్ వల్ల దెబ్బవుతుందా అన్నది చూడాలి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన స్మాల్ టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.