
`ఛలో` సినిమా విజయంతో దర్శకుడిగా వెంకీ కుడుముల మంచి పేరు తెచ్చుకున్నారు. యువ దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది కూడా. అయితే ఈ చిత్రానికి కథ తానే అందించానని, ఇందులో వెంకీ కుడుముల ప్రతిభ ఏమీ లేదని, తన తల్లి ప్రేమగా ఇచ్చిన కార్ని వెంకీ అమ్మేసి అవమానించాడని, జీవితంలో అతన్ని మళ్లీ దగ్గరికి రానివ్వనని యంగ్ హీరో నాగశౌర్య దర్శకుడు వెంకీ కుడుములపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల నాగశౌర్య `అశ్వథ్థామ` చిత్రంలో నటించారు. ఆ మూవీ రిలీజ్ సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు వెంకీ కుడుములని ప్రశ్నిస్తే.. స్నేహితుల మధ్య మనస్పర్థలు వస్తుంటాయి.. పోతుంటాయని. వాటి గురించి తను పట్టించుకోనని కూల్‌గా సమాధానం చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. శౌర్య మదర్ గిఫ్ట్‌గా ఇచ్చిన కార్ని తాను అమ్మేయలేదని, తొలిసారి ఇచ్చిన గిఫ్ట్‌ని ఎవరైనా అమ్ముకుంటారా? అని చెప్పుకొచ్చారు.
`ఛలో` కథపై శౌర్య చేసిన విమర్శలకూ అంతే కూల్ గా వెంకీ సమాధానం చెప్పారు. ఆ విమర్శలకు `భీష్మ` విజయమే సమాధానం చెబుతుందని, అంతకు మించి తాను ఏమీ చెప్పలేనని స్పష్టం చేయడం విశేషం. నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ఈ శుక్రవారంమే ప్రేక్షకుల ముందుకొస్తోంది.