బిగ్‌బాస్ సోహైల్ హీరోగా జార్జిరెడ్డి నిర్మాత సినిమా షురూ!

BiggBoss sohel debut film starts rolling
BiggBoss sohel debut film starts rolling

సాండీతో `జార్జిరెడ్డి`, సాయి రోన‌క్‌తో `ప్రెజ‌ర్ కుక్క‌ర్` వంటి విభిన్న‌మైన చిత్రాల్ని అందించిన మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. స‌జ్జ‌ల ర‌విరెడ్డితో క‌లిసి మ‌రో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా త‌న‌దైన మార్కు మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకున్న సోహైల్ సింగ‌రేణి ముద్దు బిడ్డ‌ స‌య్య‌ద్ సోహైల్ క‌థ వేరే వుంట‌ది అంటూ హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే.

బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌లో తెలివిగా వ్య‌వ‌హ‌రించి 25 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీతో పాటు మెగాస్టార్ ఇంటి నుంచి బిర్యానీని, ఆయ‌న ఆశీస్సుల‌నీ సొంతం  చేసుకున్న సోహైల్ ఈ మూవీతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఓ యూనివ‌ర్స‌ల్ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీ‌నివాస్ వింజ‌నం పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

బుధ‌వారం ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ వెల్ల‌డిస్తూ ఓ పోస్ట‌ర్‌ని పంచుకున్నారు. ఒళ్లంతా టాటూల‌తో సిగ‌రేట్ తాగుతూ టూటూ మిష‌న్‌ని ప‌ట్టుకుని కూర్చున్న సోహైల్ స్టిల్ టెర్రిఫిక్‌గా వుంది. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ చిత్రానికి శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం, నిజార్ ష‌ఫీ ఫొటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక జ‌ర‌గాల్సి వుంది. `షూటింగ్ మొద‌లైంది. మీ ప్రేమ‌, స‌పోర్ట్‌ని అలాగే కంటిన్యూ చేస్తార‌ని.. మీ ఆశీస్సులు నాతోనే వున్నాయ‌ని భావిస్తున్నాను. ఫ‌స్ట్ లుక్ ఎలా వుందో కామెంట్ చేయండి` అంటూ సోహైల్ ట్వీట్ చేశాడు.