ఫేమ‌స్ డ్యాన్స్ మాస్ట‌ర్ స‌రోజ్ ఖాన్ ఇక లేరు!


ఫేమ‌స్ డ్యాన్స్ మాస్ట‌ర్ స‌రోజ్ ఖాన్ ఇక లేరు!
ఫేమ‌స్ డ్యాన్స్ మాస్ట‌ర్ స‌రోజ్ ఖాన్ ఇక లేరు!

ప్ర‌ముఖ బాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ స‌రోజ్‌ఖాన్ (71) ఇక లేరు. శ్వాస కోస సంబంధిత స‌మ‌స్య‌తో శ‌నివారం ముంబైలోని గురునాన‌క్ ఆసుప‌త్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఈ శుక్ర‌వారం ఉద‌యం వేకువ జామున తుది శ్వాస విడిచారు. ఉద‌యం 2 గంట‌ల స‌మ‌యంలో ఆమెకు గుండె పోటు రావ‌డంతో క‌న్నుమూశారు. 1950లో బాల‌న‌టిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన స‌రోజ్‌ఖాన్ ఆ త‌రువాత ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌గా పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు.

త‌న 50 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో రెండు వేల‌కు పైగా పాట‌ల‌కు నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు. మ‌ద‌ర్ ఆఫ్ డ్యాన్స్‌గా భార‌తీయ సినీ రంగంలో చ‌ర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 1974లో `గీతా మేరా నామ్‌` చిత్రంతో సినీ ప్ర‌స్థానం ప్రారంభించిన ఆమె `మిస్ట‌ర్ ఇండియా, నగీనా, చాందినీ వంటి చిత్రాల‌కు నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి మాధురీదీక్షిత్‌కు పేరుతెచ్చిపెట్టిన `తేజాబ్` చిత్రంలోని `ఏక్ దో తీన్‌..  పాట‌కు స‌రోజ్ ఖానే కొరియోగ్రాఫ‌ర్‌. షారుఖ్ న‌టించిన `దేవ‌దాస్‌` చిత్రంలోని `డోలా రే డోలా..` పాట‌కు కూడా డ్యాన్స్ కంపోజ్ చేసింది స‌రోజ్ కానే.

ప‌లు జాతీయ పుర‌స్కారాల‌తో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `చూడాల‌ని వుంది` చిత్రంలోని `ఓ మారి ఓ మారియా..` పాట‌కు గానూ 1998లో స‌రోజ్‌ఖాన్ నంది పుర‌స్క‌రాన్ని ద‌క్కించుకున్నారు. ‌మ‌హారాష్ట్ర‌లో క‌రోనా స్వైర‌విహారం చేస్తున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం ఉద‌య‌మే స‌రోజ్‌ఖాన్ అంత్య క్రియ‌లు పూర్తి చేశారు.