స‌ల్మాన్ ఇంటికి బాంబు బెదిరింపు!


స‌ల్మాన్ ఇంటికి బాంబు బెదిరింపు!
స‌ల్మాన్ ఇంటికి బాంబు బెదిరింపు!

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ చాలా కాలంగా వార్త‌ల్లో నిలుస్తూ వ‌రుస వివాదాల్లో న‌లుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌ ఇంట్లో బాంబు వుందంటూ ముంబైలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేయ‌డం బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో వ‌ణుకు పుట్టించింది. కృష్ణ జింక‌ల వేట కేసులో ఈ మ‌ధ్య ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌కు చెందిన ఓ స్టూడెంట్ గ్రూప్ నుంచి స‌ల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌మ‌త్త‌మైన పోలీసులు ఫేస్‌బుక్ వేదిక‌గా స‌ల్మాన్‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డిన యువ‌కుల‌ని అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

దాదాపు రెండు నెల‌ల త‌రువాత మ‌రోసారి అలాంటి బెదిరింపే శ‌నివారం ముంబై బాంద్రా పోలీసులుకు రావ‌డంతో అంతా ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన 16 ఏళ్ల యువ‌కుడు ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో వున్న స‌ల్మాన్‌ఖాన్ ఇంటికి బాంబు పెట్టామ‌ని, ఆ బాంబు మ‌రో రెండు గంట‌ల్లో పేలుతుంద‌ని, దాన్ని ఆప‌గ‌లిగితే ఆపండ‌ని బాంద్రాలోని పోలీస్‌స్టేష‌న్‌కు ఈ మెయిల్‌ని పంపించాడు. డిసెంబ‌ర్ 4న వ‌చ్చిన ఈ ఈమెయిల్‌ని సీరియ‌స్‌గా తీసుకున్న బాంద్రా పోలీసులు బాంబ్ స్క్వాడ్‌ని తీసుకెళ్లి నాలుగు గంట‌ల పాటు స‌ల్మాన్ ఇంటిని సోదా చేశార‌ట‌.

ఆ స‌మ‌యంలో స‌ల్మాన్ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని అపార్ట్ మెంట్‌కి దూరంగా వుంచామ‌ని, సోదాల త‌రువాత ఎలాంటి బాంబ్ ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. బాంబ్ బెదిరింపు మెయిల్ ని పంపిచిన యువ‌కుడిని బాంద్రా పోలీసులు గ‌జియాబాద్‌లో ప‌ట్టుకున్నారు. అత‌న్ని కోర్టులో హాజ‌రు ప‌రిచి జైలుకు త‌ర‌లించిన‌ట్టు తెలిసింది. ఆక‌తాయి త‌నంగా చేసిన పని అని తేల‌డంతో న్యాయ‌మూర్తి ఆ యువ‌కుడిని మంద‌లించి వ‌దిలి వేయాల‌ని, మ‌రోసారి ఇలాంటి ఆక‌తాయి ప‌నులు చేయ‌రాద‌ని మంద‌లించిన‌ట్టు తెలిసింది. ఈ నెల 4న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.