
నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ముచ్చటగా మూడవ సారి కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ని చేస్తున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్‌రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో హీరో బాలకృష్ణ 60వ పుట్టిన రోజున రిలీజ్ చేసిన బిబి3 ఫస్ట్ లుక్ టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీంతో సినిమా ఓ రేంజ్లో వుండే అవకాశం వుందని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇందులో బాలకృష్ణ గుబురు మీసంతో మాసీవ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఇదే సినిమాలోని ఓ సన్నివేశంలో బాలయ్య అఘోరాగా షాకింగ్ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. బాలయ్య 106వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేశారు. సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్నఈ చిత్రానికి పవర్ఫుల్ టైటిల్‌ని ఫైనల్ చేయాలని బోయపాటి గత కొన్ని రోజులుగా తర్జన భర్జన పడుతున్నారట.
పుట్టిన రోజు సందర్భంగానే ఈ చిత్రానికి టైటిల్‌ని ఫైనల్ చేసి టీజర్‌ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అప్పటికి పవర్ఫుల్ టైటిల్ సెట్ కాలేదని, దాంతో ఫస్ట్ లుక్ టీజర్‌ని మాత్రమే రిలీజ్ చేశారట. ఇక ఈ చిత్రానికి `మోనార్క్` అనే టైటిల్‌ని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు మించి పవర్ఫుల్ టైటిల్‌ని పెట్టాలని భావించారట బోయపాటి. అయితే ఆ టైటిల్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో ఫైనల్‌గా ప్రచారంలో వున్న `మోనార్క్` టైటిల్‌నే ఈ చిత్రానికి నిర్ణయించినట్టు తెలిసింది. మంచి ముహూర్తం చూసుకుని టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేయాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారట.