బాలకృష్ణ, రోజా… జరిగే పనేనా? 

Boyapati want to cast Roja as villain
Boyapati want to cast Roja as villain

నందమూరి బాలకృష్ణ, రోజా అంటే 90లలో సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అందుకే ఈ జంటను స్క్రీన్ పై చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకునే వారు. వీరిద్దరూ కలిసి భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత రోజా నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం, అటుపై అవి కూడా తగ్గించేసి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండడం జరుగుతూ వస్తోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముందు టిడిపిలోనే పనిచేసిన ఇద్దరూ తర్వాత రోజా వైసిపికి వెళ్లడంతో ప్రత్యర్ధులయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే బాలకృష్ణ ప్రతిపక్ష పార్టీలో ఉంటే, రోజాది అధికార పక్షం. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే జబర్దస్త్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రోజా పలు సందర్భాల్లో బాలకృష్ణపై వాడివేడి వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రవర్తనను తప్పుపట్టింది. ఇప్పుడు అధికార పక్షం కాబట్టి విమర్శలు చెయ్యట్లేదు. రాజకీయ పరంగా ఇద్దరి మధ్యనా దూరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇదంతా ఎందుకంటే ఒక దర్శకుడు వీరిద్దరినీ పెట్టి సినిమా తీయాలని అనుకుంటున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు బోయపాటి శ్రీను.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ బోయపాటి  శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా రెండూ కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. సో ఈసారి హ్యాట్రిక్ ఎలాగైనా మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారు. ఈ చిత్రంలోనే రోజాని విలన్ గా నటింపజేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన బోయపాటికి కలిగిందిట. ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళను, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న వాళ్ళను మళ్ళీ తన సినిమాల్లో నటింపజేయాలనుకుంటాడు బోయపాటి.

అందుకే లెజండ్ లో జగపతి బాబుని విలన్ ను చేసి సూపర్ క్రేజ్ ను తీసుకొచ్చాడు. సరైనోడులో శ్రీకాంత్ కు ముఖ్య పాత్ర ఇచ్చాడు, ఆదిని విలన్ ను చేసాడు. అలాగే జయ జానకి నాయకలో శరత్ కుమార్ ను తీసుకొచ్చాడు. వినయ విధేయ రామలో స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి వాళ్ళను తీసుకున్నాడు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న రోజాను విలన్ చేయాలని భావిస్తున్నాడు. అయితే రోజా ఇందుకు సముఖంగా లేకపోయినా బోయపాటి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోజా కనుక ఎస్ అంటే ఈ సినిమాకు క్రేజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు సినిమాలో ఢీ అంటే ఢీ అనే పాత్రలను పోషిస్తే ప్రేక్షకులలో ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతాయి.