అల వైకుంఠపురములో థమన్ మరో మైల్ స్టోన్ ను అందుకున్నాడు


అల వైకుంఠపురములో థమన్ మరో మైల్ స్టోన్ ను అందుకున్నాడు
అల వైకుంఠపురములో థమన్ మరో మైల్ స్టోన్ ను అందుకున్నాడు

ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో ఆల్బమ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సాధించిన అద్భుత విజయంలో పాటలదే అగ్రతాంబూలం అంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క పాట అని కాకుండా ఆల్బమ్ మొత్తం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ పాటలకు ఆరంభమే అదిరిపోయింది. సామజవరగమన సాంగ్ తో మొదలైన అల వైకుంఠపురములో ప్రభంజనం ఇంకా ఆగలేదు. సామజవరగమన పాట విడుదలైనప్పుడు శ్రోతలను ఊపేసింది. రాములో రాముల ఆ ఊపును కొనసాగించింది.

ఇక ఇప్పుడు హవా అంతా ఆఖరున విడుదల చేసిన బుట్ట బొమ్మ సాంగ్ దే. ఈ సినిమా ఆల్బమ్ లో ఆఖరున విడుదలైనా బుట్ట బొమ్మ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అందరినీ ఊపేస్తోంది. లిరికల్ సాంగ్ కన్నా వీడియో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి రీసెంట్ గా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్ ను వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మన పాట ఖండాంతరాలు దాటి అందరినీ అలరిస్తోందని ఖుషీ అయ్యారు.

అందరి ఫేవరేట్ అయిన ఈ బుట్ట బొమ్మ పాట ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. బుట్ట బొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ ఆల్బమ్ ను విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ కు కాసులు వర్షం కురిపించింది ఈ సినిమా. సామజవరగమన లిరికల్ సాంగ్ 180 మిలియన్ వ్యూస్ దాటి తెచ్చుకోగా, రాములో రాముల అయితే ఏకంగా 260 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో బుట్ట బొమ్మ కూడా చేరింది. ఒక్క సినిమాలో అన్ని పాటలు ఇంతలా హిట్ అవ్వడం విశేషమే మరి.