మహేష్ తో మారుతి.. జరిగే పనేనా?


మహేష్ తో మారుతి.. జరిగే పనేనా?
మహేష్ తో మారుతి.. జరిగే పనేనా?

తనకేదైనా సినిమా నచ్చితే ఆ దర్శకుడ్ని ఆకాశానికెత్తేస్తూ పొగిడేయడం మహేష్ కు అలవాటు. కుదిరితే ఆ దర్శకుడితో సినిమా చేయాలనుకుంటాడు. ఎఫ్ 2 సినిమా విపరీతంగా నచ్చేయడంతో అనిల్ రావిపూడికి కథ చెప్పే అవకాశమిచ్చాడు. వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకున్న అనిల్, సరిలేరు నీకెవ్వరు కథ చెప్పి ఫ్లాట్ చేసేసాడు. వెంటనే మహేష్ తాను చేయాల్సిన సుకుమార్ కథను కూడా పక్కకు పెట్టేసి అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టేశాడు. అలాగే గీతా గోవిందం నచ్చేయడంతో పరశురామ్ ను కూడా పిలిచి కథ చెప్పమన్నాడు. అయితే ఇది అంత ఈజీగా వర్కౌట్ కాలేదు. చాలా కాలం కథపై కూర్చున్న పరశురామ్ ఎంతకూ మహేష్ ను మెప్పించలేకపోవడంతో ప్రస్తుతం నాగ చైతన్యతో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే భవిష్యత్తులో మహేష్ తో కచ్చితంగా సినిమా చేస్తానని అంటున్నాడు పరశురామ్.

ఇక మారుతి విషయానికొస్తే భలే భలే మగాడివోయ్ సినిమా టైమ్ లోనే మహేష్ పిలిచి మారుతికి కథ చెప్పమన్నాడట. భలే భలే మగాడివోయ్ తనకు తెగ నచ్చేసిందని, మంచి కథతో తన వద్దకు రమ్మని మారుతికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా మారుతి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. అయితే మారుతి శైలే వేరు. అతను ఇప్పటిదాకా చిన్న లేదా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. మారుతి సినిమాలు అన్నీ పరిమిత బడ్జెట్ లో తెరకెక్కుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మహేష్ తో మారుతి సినిమా అంటే ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.

అయితే భలే భలే మగాడివోయ్ టైమ్ లోనే అడ్వాన్స్ ఇచ్చినా మారుతి ఇంతవరకూ ఎందుకు సినిమాను సెట్ చేయలేదు అన్నది అర్ధం కాని ప్రశ్నగా మిగిలింది. మారుతి తన కథతో మహేష్ ను మెప్పించలేకపోయాడా లేక ఇప్పుడే స్టార్ హీరోతో ఎందుకు అని మారుతి ఫీల్ అయ్యాడా? ఈ విషయంపై మాత్రం ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న మారుతి. ఇక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల కానున్న విషయం తెల్సిందే.