ఎనర్జిటిక్ స్టార్ కు ఆ రీమేక్ వర్కౌట్ అవుతుందా?


ఎనర్జిటిక్ స్టార్ కు ఆ రీమేక్ వర్కౌట్ అవుతుందా?
ఎనర్జిటిక్ స్టార్ కు ఆ రీమేక్ వర్కౌట్ అవుతుందా?

వరస ప్లాపుల నుండి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవలే ఉపశమనం పొందాడు. ఇస్మార్ట్ శంకర్ తో అదిరిపోయే హిట్ కొట్టాడు రామ్. అయితే రామ్ తర్వాతి సినిమా విషయంలో తొందరపడి వెంటనే దేనికి ఓకే చెప్పేయలేదు. కొన్ని నెలల సమయం తీసుకున్నాడు. కొన్ని కథలు విన్నాడు. మాస్ సినిమా చేసాక మళ్ళీ అలాంటి సినిమా చేయాలా లేక క్లాస్ మూవీ వైపు వెళ్లాలా అని దాదాపు నాలుగు నెలలు ఆలోచించిన తర్వాత తమిళంలో హిట్టైన తడం సినిమా రీమేక్ ను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి రెడ్ అనే టైటిల్ కూడా పెట్టాడు. ఫస్ట్ లుక్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా రిలీజ్ చేసేసాడు. అయితే రీమేక్ ను ఎంచుకోవడానికి ఎందుకింత సమయం అని అడిగితే తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేశామని, కొన్ని సీన్లు మళ్ళీ మార్చి రాశామని, పైగా షెడ్యూల్స్ అన్నీ పక్కాగా సెట్ చేసుకున్న తర్వాత లాంచ్ కు వెళుతున్నామని తెలిపాడు రామ్. తనతో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు కిషోర్ తిరుమల ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 16 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఏప్రిల్ 9న సినిమాను రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించేసాడు రామ్.

హిట్టు వచ్చిన వేళావిశేషమేమో ఏమిటో కానీ రామ్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాలో తన పాత్రకు తగ్గట్లుగా లుక్, హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాడు. అంతా సెట్ అనుకున్నాడు. అయితే ఒక్కడో విషయముంది. ఈ సినిమాలో హీరోది డ్యూయల్ రోల్. ఒరిజినల్ లో అరుణ్ విజయ్ రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపిస్తూ అదరగొట్టాడు. పైగా ఇద్దరూ బ్రదర్స్ గా నటిస్తారు. రామ్ తన 17 సినిమాల కెరీర్ డ్యూయల్ రోల్ పోషించింది లేదు. పైగా దర్శకుడు కిషోర్ తిరుమల ఇప్పటివరకూ ఫీల్ గుడ్ మూవీస్ నే తెరకెక్కించాడు కానీ తడం వంటి థ్రిల్లర్ ను హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. మరి రామ్, కిషోర్ తిరుమల తమ హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఏం చేస్తారో చూడాలి. అన్నట్లు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వడంతో రామ్ రెడ్ కు కూడా మణిశర్మను కంటిన్యూ చేసాడు.