శృతి హాసన్ రీ ఎంట్రీ.. హీరోయిన్ గా రాణించగలదా?

can shruti haasan give perfect re entry
Shruti Haasan

మొదట ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ శృతి హాసన్.. గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ రుచి చూసింది. ఇక అంతే ఆమె వెనుతిరిగి చూసింది లేదు. వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ సూపర్ హిట్లు సాధిస్తూ ఐరన్ లెగ్ అన్న వాళ్ళ చేతే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ మళ్ళీ నటించింది లేదు. ప్రియుడు మైఖేల్ కోర్సలే తో ప్రేమాయణం, ఆపై లండన్ లో మ్యూజిక్ కెరీర్ అంటూ సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.

అయితే శృతి హాసన్ ఇప్పుడు మళ్ళీ సింగిల్. మైఖేల్ తో పెళ్లి వరకూ వెళ్తుందనుకున్న ప్రేమాయణం మధ్యలోనే బెడిసికొట్టింది. దీంతో అమ్మడు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే తమిళంలో ఒక సినిమా చేస్తోంది శృతి హాసన్. విజయ్ సేతుపతి సరసన లాబం అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. మరోవైపు తెలుగులో కూడా రీ ఎంట్రీ కోసం ఒక మంచి సినిమా కోసం ఎదురుచూస్తోంది.

ఈ సమయంలో శృతి హాసన్ కు రవితేజ సినిమా ఆఫర్ వచ్చింది. మాస్ మహారాజ రవితేజతో గోపీచంద్ మలినేని చేయబోతున్న పోలీస్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం కూడా వచ్చింది. రవితేజ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని.. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఇదివరకు బలుపు సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది.

అయితే రీ ఎంట్రీలో బిజీ కావాలని చూస్తున్న శృతి హాసన్ కు ప్రయాణం అంత సులువుగా ఉండబోదు. ఇప్పటికే ఆమెను దాటి యువ హీరోయిన్లు టాప్ స్థానం కోసం పరిగెడుతున్నారు. అందులోనూ రేసు గుర్రం, శ్రీమంతుడు, గబ్బర్ సింగ్ సమయంలో ఉండాల్సిన గ్లామర్ ఆమెలో ఇప్పుడు ఉందా అంటే అనుమానమే. ఈ నేపథ్యంలో శృతి హాసన్ రీ ఎంట్రీ తెలుగులో ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

సెంటిమెంట్ పరంగా చూసినా కూడా శృతి హాసన్ కు కలిసిరావట్లేదు. ఎందుకంటే హీరోలకు రీ ఎంట్రీ విషయంలో ఉండే క్రేజ్ హీరోయిన్లకు ఉండదు. ఇలియానా ఇలాగే అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ద్వారా తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పాటు ఇలియానా లుక్స్ పై కూడా కామెంట్స్ వినపడ్డాయి. దీంతో మళ్ళీ ఇలియానాకు తెలుగులో సినిమా లేదు. శృతి హాసన్ కెరీర్ కూడా ఇలానే అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

ఇక రవితేజ – గోపీచంద్ మలినేని, సినిమా విషయానికి వస్తే ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన విజయ్ సినిమా తేరి కి రీమేక్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే తెలుగు వెర్షన్ పోలీసోడుగా ఆన్లైన్ లో అవైలబుల్ ఉండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం ఎంతవరకూ కరెక్ట్ అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే ఈ చిత్రం తేరి రీమేకా లేక కొత్త కథతో రూపొందుతోందా?