అడ్డాల మొత్తం కొత్తవాళ్ళతోనే వెళ్తున్నాడుగా


Casting call for Srikanth Addala Asuran remake
Casting call for Srikanth Addala Asuran remake

గత నెలలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలలో ధనుష్ నటించిన అసురన్ సినిమా ఒకటి. ఇది తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇది ఒక రా అండ్ ఇంటెన్స్ కథ. వయొలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా రా గా చూపిస్తేనే ఈ సినిమాకు కిక్కు. ఇలాంటి సినిమాను వెంకటేష్ రీమేక్ చేయాలనుకోవడమే తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అసురన్ కు ఉన్న ఇమేజ్ కు, వెంకటేష్ కు ఉన్న ఇమేజ్ పూర్తిగా భిన్నం. వెంకటేష్ చేయడమే వింత అనుకుంటే సురేష్ బాబు అండ్ కో మరో పెద్ద షాక్ ఇచ్చారు. ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారు. శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా సాఫ్ట్ డైరెక్టర్, ఆయన సినిమాల్లో మంచితనం ప్రవహిస్తూ ఉంటుంది. అందరినీ నవ్వుతూ ఉండమని చెప్పే ఫిలాసఫీ కూడా ఉంటుంది. ఇప్పటిదాకా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సినిమాల్లో గట్టిగా ఒక్క ఫైట్ కూడా లేదు. అలాంటిది అసురన్ లో ఏ శరీర భాగం కనిపిస్తే దాన్ని నరికేసుకుంటారు. మరి శ్రీకాంత్ అడ్డాల ఏ మేరకు ఈ రీమేక్ కు న్యాయం చేయగలడు అన్నది చూడాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఎంచుకుంటున్న నటీనటుల విషయంలో కూడా సురేష్ బాబు అండ్ కో ఆశ్చర్యపరుస్తున్నారు. వెంకటేష్, హీరోయిన్ తప్పితే మిగతా అందరినీ కొత్త వాళ్లనే తీసుకునేలా ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్ ఒకటి జరిగింది. అందులో ప్రకటించిన దాని ప్రకారం మొత్తం అందరూ మేల్ ఆర్టిస్ట్ లే కావాలి. అందులో ప్రకటించిన వయసుల ప్రకారం వారికి హీరో బావ, హీరో ఇద్దరు కొడుకులు, విలన్, విలన్ దగ్గర ఉండే ఇతర ముఖ్య పాత్రలు కావాలని తెలుస్తోంది. ఇవన్నీ కూడా ముఖ్య పాత్రలే. మరి ఇంతటి ఇంటెన్స్ సినిమాను పక్కన వెంకటేష్ ను పెట్టుకుని కొత్తవాళ్లతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించడం అంటే ఇదేదో ఆసక్తికర వ్యవహారంలానే ఉంది. మరి ఈ సినిమా యూనిట్ ఆలోచనా తీరు ఎలా ఉందో అర్ధం కావడం లేదు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని ఆశిస్తున్నారు. హీరోయిన్ గా శ్రియ ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వస్తాయి.

మరోవైపు సురేష్ బాబు వెంకీ మామ సినిమా రిలీజ్ టెన్సన్స్ లో ఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 13న విడుదల చేద్దామనుకుంటున్నట్లు తెలిపినా ఇంకా అధికారిక సమాచారం రాకపోవడంపై అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు నాగ చైతన్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 13న రాదని, డిసెంబర్ 25న విడుదలవుతుందని అంటున్నారు. మరికొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.