మళ్ళీ ఆమెకే అవకాశమిచ్చిన బోయపాటి


మళ్ళీ ఆమెకే అవకాశమిచ్చిన బోయపాటి
మళ్ళీ ఆమెకే అవకాశమిచ్చిన బోయపాటి

బోయపాటి శ్రీనుకి దర్శకుడిగా ఇమేజ్ కు బాగానే డ్యామేజ్ చేసింది వినయ విధేయ రామ చిత్రం. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ అవ్వడమే కాకుండా ట్రోల్స్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈ సినిమాతో మీమ్ పేజెస్ వాళ్ళు పండగ చేసుకున్నారు. అయితే ఈ సినిమా అందించిన చేదు జ్ఞాపకం నుండి బయటపడిన బోయపాటి, తిరిగి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవ్వాలని భావిస్తున్నాడు. తనను ట్రోల్స్ చేసినవాళ్లకు తన సత్తా ఏంటో మరోమారు చూపించాలని తహతహలాడుతున్నాడు. అందుకే బాలకృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్న బోయపాటి, అది టార్గెట్ మిస్ అవ్వకూడదని కృతనిశ్చయంతో ఉన్నాడు.

బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెల్సిందే. సింహా, లెజండ్ తర్వాత తెరకెక్కబోయే ఈ హ్యాట్రిక్ చిత్రం కూడా మాస్ మాసాలా ఎంటర్టైనర్ గా ఉండబోతోందని వినికిడి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. థమన్ ను సంగీత దర్శకుడిగా ఓకే చేసేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నటించే ఒక హీరోయిన్ గా క్యాథెరిన్ ను ఫైనల్ చేశారట. అయితే మెయిన్ హీరోయిన్ రోల్ కోసం వేట ఇంకా కొనసాగుతోంది.

ప్రతీ దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి కొంత మందితో కంఫర్ట్ ఉంటుంది. వాళ్లతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. బోయపాటి శ్రీనుకి క్యాథెరిన్ తో కంఫర్ట్ ఉంది. అందుకే ఆమెకు ముందు సరైనోడులో అవకాశమిచ్చాడు. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ అయినా కూడా ఎమ్మెల్యేగా చేసిన క్యాథెరిన్ కు బాగా పేరొచ్చింది. ఆమె కెరీర్ కు ఈ చిత్రం మంచి మైలేజ్ ను ఇచ్చిందని చెప్పాలి. సరైనోడు తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జయ జానకి నాయకలో ఈ హీరోయిన్లను రిపీట్ చేసాడు బోయపాటి. ఇందులో క్యాథెరిన్ చేత ఒక స్పెషల్ సాంగ్ చేయించాడు.

ఇక ఇప్పుడు క్యాథెరిన్ ను బాలయ్య సినిమాలో కూడా సెలక్ట్ చేసాడని సమాచారం. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.