చిరు 152.. పాటతో షురూ!


చిరు 152.. పాటతో షురూ!
చిరు 152.. పాటతో షురూ!

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది తన కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిలో నటించిన సంగతి తెల్సిందే. ఫలితం సంగతి పక్కన పెడితే ఈ చిత్రం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని చిరంజీవి, ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ కూడా ప్రకటించారు. తెలుగు వరకూ ఈ చిత్రం బాగానే ఆడింది. 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి చిరంజీవి స్టామినా ఏ మాత్రం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపించినట్లైంది. సైరా తర్వాత చిరంజీవి చేయబోయే 152వ చిత్రం ముహూర్తం దసరా సందర్భంగా చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడన్న విషయం కూడా అధికారికంగా ఎప్పుడో ధృవీకరించబడింది.

దర్శకుడిగా కొరటాల శివకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. చేసిన నాలుగు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచి కొరటాల శివను టాప్ దర్శకుడిగా నిలబెట్టాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా అన్ని చిత్రాలు కొరటాల శివ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో చిరంజీవితో శివ చేయబోయే సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ముహూర్తం పెట్టి నెలలు గడుస్తున్నా ఇంకా షూటింగ్ ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఒకింత అసహనానికి గురయ్యారు కూడా. అయితే విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, చిరంజీవి 152వ చిత్రం షూటింగ్ డిసెంబర్ 26 నుండి మొదలవుతుందని తెలుస్తోంది. నాలుగు రోజులు మొదటి షెడ్యూల్ లో భాగంగా పాటను చిత్రీకరిస్తారట. తర్వాత కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి రాజమండ్రి దాని పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని, సినిమా మెజారిటీ భాగం షూటింగ్ ఇక్కడే తీస్తారని తెలుస్తోంది.

త్రిషను కథానాయికగా కన్ఫర్మ్ చేసేసినట్లు సమాచారం. ఇక కొరటాల శివకు ఎప్పుడూ పనిచేసే దేవిశ్రీ ప్రసాద్ కాకుండా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. ఇటీవలే బ్యాంకాక్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. ట్యూన్స్ అన్నీ ఫైనలైజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి.