సీనియర్ హీరోల మధ్య దసరా పోటీ


సీనియర్ హీరోల మధ్య దసరా పోటీ
సీనియర్ హీరోల మధ్య దసరా పోటీ

ఈసారి సంక్రాంతికి రసవత్తర పోటీని టాలీవుడ్ ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇద్దరు టాప్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడటం అందులోనూ సినిమాలు ఎక్కువగా చూసే సంక్రాంతి సీజన్ లో పోటీ పడడంతో ప్రేక్షకులు థ్రిల్లయ్యారు. ఈ సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించాయి. ఈ రెండు సినిమాలూ కలిసి దాదాపు 250 కోట్ల షేర్ ను కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కొల్లగొట్టాయి. అయితే సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అయిన సమ్మర్ కు పెద్ద సినిమాలు ఏవీ రావట్లేదు. పవన్ కళ్యాణ్ నటించిన పింక్ రీమేక్ ఉంది కానీ అది కమర్షియల్ గా భారీ రేంజ్ సినిమా కాదు. ఇక సమ్మర్ అయిపోతే టాలీవుడ్ వరకూ పెద్ద పండగ దసరాతోనే ఉంది. ఈ దసరాకు కూడా రెండు భారీ సినిమాలు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ నటించిన చిత్రం రీసెంట్ గా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. కేవలం 99 రోజుల వర్కింగ్ డేస్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని చిరంజీవి, కొరటాల శివ ఇద్దరూ కూడా సరిలేరు నీకెవ్వరు స్టేజ్ మీద వాగ్దానాలు చేసారు. ఈ నేపథ్యంలో మే లేక జూన్ కు సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్ట్ 15 వారాంతంలో సినిమాను రిలీజ్ చేయవచ్చు. అయితే ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే మాత్రం దసరాకు సినిమా విడుదల ఉంటుంది.

ఇక నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసే సినిమా షూటింగ్ ఫిబ్రవరి 15 నుండి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని దసరా బరిలో దింపాలని ముందు నుండీ భావిస్తున్నారు. ఒకవేళ చిరు సినిమా ఆలస్యమైతే మాత్రం దసరా వార్ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రేక్షకులకు మరోసారి వీనుల విందు ఖాయం.