పవర్ స్టార్ మ్యానరిజంతో పిచ్చెక్కించిన చిరంజీవి


పవర్ స్టార్ మ్యానరిజంతో పిచ్చెక్కించిన చిరంజీవి
పవర్ స్టార్ మ్యానరిజంతో పిచ్చెక్కించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు, సైద్ధాంతిక పరంగా ఇద్దరూ విభేదించినా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది. ఎన్నోసార్లు వీరి మధ్య వివాదాలు వచ్చినట్లు అసలు మొహం మొహం చూసుకోనట్టు కథనాలు వస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు మేము ఎప్పట్లానే ఉన్నాం. మేమంతా ఒకటి అని ఏదొక సందర్భంలో చెబుతుంటారు ఈ అన్నదమ్ములు. ఈ మధ్య ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడడం కొద్దిగా తగ్గింది. అయితే తామిద్దరం ఎప్పట్లానే ఉన్నాం అని చిరంజీవి నిన్న రాత్రి చెప్పకనే చెప్పాడు. నిన్న రాత్రి అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు చిరంజీవి. నిఖిల్ నటించిన ఈ చిత్రం ఏడాది క్రితమే విడుదల కావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీనికి అందరూ ఆర్థికపరమైన ఇబ్బందులు అని అనుకున్నారు కానీ నిఖిల్ ఇటీవలే అలాంటివేం లేవని, చిన్న గొడవలు వచ్చాయని, అయితే ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయాయని చెప్పాడు. అంతే కాకుండా ఇటీవలే నిఖిల్ వెళ్లి చిరంజీవిని కలిసి వచ్చి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి వస్తా అన్నారని, తన కల నిజమైనట్లు ఉందని బోలెడంత ఉత్సాహంతో చెప్పాడు.

దాన్ని నిజం చేస్తూ చిరంజీవి కూడా నిన్న అర్జున సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. నవంబర్ 29న విడుదల కాబోతోన్న ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడి దీనిపై ఉన్న బజ్ ను అమాంతం పెంచేసాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అర్జున్ సురవరం సినిమాపై జనాల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అర్జున్ సురవరం గురించి చెబుతోన్న సమయంలో.. ఈ చిత్రంలో ఒక చేగువేరాపై ఒక పాట ఉంటుందని, ఆ పాట చూస్తున్నప్పుడు నాకు ఒక పేరు గుర్తొస్తుందని చెప్పి ఆపేసాడు చిరంజీవి. వెంటనే జనాలు అందరూ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ అని అరవడం మొదలుపెట్టారు. అప్పుడు చిరంజీవి తన చేతిని మెడపై పెట్టుకుని అభిమానులు అందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగచేసాడు. ఆ తర్వాత మాట్లాడుతూ ఎస్, నా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసాడు.

ఇక అర్జున్ సురవరం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తాను ముందే చూశానని తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తనని ఎవరూ పిలవలేదని, తనంతట తానే ఈ ఈవెంట్ కు హాజరయ్యానని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇలా తాను పిలవకుండా హాజరైన ఈవెంట్ ఇది ఒక్కటేనని చెప్పాడు. పై వ్యాఖ్యలతో అర్జున్ సురవరం సినిమా బజ్ అమాంతం పెరిగింది. నిఖిల్, సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సంతోష్ తెరకెక్కించాడు. ఫేక్ సర్టిఫికెట్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం నడుస్తుంది. తమిళ హిట్ చిత్రం కనిదన్ కు ఈ సినిమా రీమేక్.