త్వరలో జగన్ తోనూ భేటీ కానున్న చిరు అండ్ కో


త్వరలో జగన్ తోనూ భేటీ కానున్న చిరు అండ్ కో
త్వరలో జగన్ తోనూ భేటీ కానున్న చిరు అండ్ కో

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా, చిరంజీవి చొరవ చూపుతున్నారు. కరోనా సమయంలో ఇండస్ట్రీలో రోజూ జీతగాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో క్రైసిస్ చారిటి పెట్టడంలో చిరంజీవిదే కీలక పాత్ర. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో చొరవ చూపి వీలైనంత త్వరగా షూటింగ్ లను మొదలుపెట్టేలా చూస్తున్నాడు చిరంజీవి. ఇటీవలే ఆయన నేతృత్వంలోనే మొదట తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయిన చిరు అండ్ కో, తర్వాత సీఎం కేసీఆర్ ను కూడా కలిసి షూటింగ్ లు త్వరగా జరిగేలా చూడాలని  విజ్ఞప్తి చేసారు.

వచ్చే నెల నుండి షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కూడా చిరంజీవి మచ్చిక చేసుకుంటున్నారు. ఏపీలో షూటింగ్ లు సులభతరం చేసేందుకు జగన్ కంకణం కట్టుకున్న విషయం తెల్సిందే. అందుకోసమే సింగిల్ విండో సిస్టంను ప్రారంభించారు. ఈ విషయమై జగన్ కు ఫోన్ చేసి కృతఙ్ఞతలు చెప్పారు చిరంజీవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పూర్తయ్యాక ఇండస్ట్రీ పెద్దలతో ఏపీకి రావాలని ఇండస్ట్రీలోని పలు సమస్యల పరిష్కారానికై సమావేశం ఏర్పాటు చేసి ప్రయత్నిద్దామని జగన్ స్వాగతం పలికారు. చిరంజీవి కూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక తప్పకుండా అన్ని శాఖల పెద్దలతో కలిసి వస్తానని చిరంజీవి అన్నారు. ఈ విషయమై చిరంజీవి సోషల్ మీడియాలో తెలిపి తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న జగన్ కు కృతఙ్ఞతలు తెలిపారు.