మెగా152 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్!


మెగా152 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్!
మెగా152 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్!

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. రంగస్థలం సినిమా కోసం నిర్మించిన గ్రామ సెట్స్ లో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను సాగిస్తున్నారు. చిరంజీవి ఉద్యమ నాయకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. నిజానికి మొదట చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో ఉద్యోగిగా నటిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు చిరంజీవి ఈ లుక్ లో కనిపించడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఉండే స్పెషల్ రోల్ విషయంలో కూడా బోలెడన్ని రూమర్స్ ఉన్నాయి. ఇందులో చరణ్ నటిసున్నాడని, లేదు చరణ్ స్థానంలో మహేష్ బాబు చేస్తాడని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనిపై కూడా చిత్ర యూనిట్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగా ఆగష్టు 21న విడుదల చేయనున్నట్లు సమాచారం. నిజానికి ఆర్ ఆర్ ఆర్ విడుదల వచ్చే సంక్రాంతికి వాయిదా పడిన నేపథ్యంలో చరణ్ చిరంజీవి చిత్రంలో నటిస్తున్న కారణంగా ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి తర్వాతికి వాయిదా వేస్తారన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు రాజమౌళితో చిరంజీవి జరిపిన చర్చలు ఫలించాయో లేక నిజంగానే చరణ్ స్థానంలో మహేష్ ను తీసుకున్నారో తెలియదు కానీ రిలీజ్ మాత్రం ఆగష్టులో ఫిక్స్ చేసారు. షూటింగ్ మొత్తాన్ని మే కల్లా పూర్తయ్యేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారు.

త్రిష కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. సైరా తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రంలో నటిస్తోన్న ఈ సినిమాపై అటు బిజినెస్ వర్గాల్లో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో చిరంజీవి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు.