విజయ్ దేవరకొండ – నాని వ్యవహారం ఇలా తీరింది!


clarity on shiva nirwana third film
clarity on shiva nirwana third film

సినిమాలు చేయడంలో న్యాచురల్ స్టార్ నాని స్పీడ్ వేరు. ఒకటి నిర్మాణంలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టె నాని ఈజీగా సంవత్సరానికి రెండు సినిమాలను చేసేస్తాడు. ఇంకా కుదిరితే మూడు కూడా రిలీజ్ చేయగల జెట్ స్పీడ్ లో చేసుకుపోతాడు నాని. అయితే ప్రస్తుతం నాని కెరీర్ అంత బాలేదు. సినిమాలు బాగుంటున్నాయి అన్న పేరు వస్తున్నా కమర్షియల్ గా పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు. రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నాని కెరీర్ లో మరో బిలో యావరేజ్ సినిమాగా గ్యాంగ్ లీడర్ మిగిలిపోయింది. నానికి ఈ మధ్య సరైన సక్సెస్ లేకపోవడంతో తన దగ్గరకి వచ్చిన కథలు వెనక్కి వెళ్ళిపోతున్నాయనే పుకారు ఒకటి మొదలైంది. అందుకు ఉదాహరణగా శివ నానితో సినిమా కమిట్మెంట్ ఉన్న శివ నిర్వాణ ఇప్పుడు ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుని విజయ్ దేవరకొండతో జట్టు కట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త నానికి కోపం తెప్పించింది కూడా.

అయితే దీని వెనుక నిజానిజాలు వేరుగా ఉన్నాయి. శివ నిర్వాణ, నాని చిత్రం క్యాన్సిల్ అవ్వలేదట. ఈ మధ్య విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రాల గురించి చెబుతూ శివ నిర్వాణతో సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకే నాని చిత్రం క్యాన్సిల్ అయిందనుకున్నారంతా. అసలు నిజం ఏమిటంటే శివ నిర్వాణ విజయ్ దేవరకొండను కలిసి కథ చెప్పిన మాట వాస్తవమేనని, విజయ్ కూడా ఆ కథతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కానీ నానితో ఓకే చేసుకున్న కథ, విజయ్ కు చెప్పిన కథ వేరు వేరుట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ బిజీగా ఉండడంతో తనకు లైన్ చెప్పి తన సినిమాకు శివ నిర్వాణ కమిట్ చేయించాడని సమాచారం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొన్ని రోజులు చేస్తే ఆ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. అది పూర్తవ్వగానే పూరి జగన్నాథ్ చిత్రం జనవరి నుండి మొదలవుతుంది. ఇది కాకుండా హీరో అనే చిత్రం కూడా విజయ్ దేవరకొండ చేయాల్సి ఉంది. ఈ చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. పూరి జగన్నాథ్ సినిమా అవ్వగానే హీరోని తిరిగి ప్రారంభిస్తాడు.

ఇన్ని చిత్రాలు చేసాక విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ సినిమా ఉంటుందన్నమాట. ఈలోగా శివ నిర్వాణ నానితో సినిమాను పూర్తి చేసుకుని, విజయ్ తో సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తాడు. నాని ప్రస్తుతం V చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. V చిత్ర షూటింగ్ పూర్తవ్వగానే శివ నిర్వాణ సినిమా మొదలవుతుంది. V లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇది నాని 25వ చిత్రం కావడంతో చాలా స్పెషల్ గా ఉండేలా దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్లాన్ చేస్తున్నాడు. అదీ సంగతి.