వెంకీ మామ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఏది?


Confusion around Venky Mama release date
Confusion around Venky Mama release date

సినిమా ప్లానింగ్ అంటే బాలీవుడ్ వాళ్లనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కంటెంట్ విషయంలో ఎలా ఉన్నా కానీ సినిమా ప్లానింగ్ లో పక్కాగా ఉంటారు వాళ్ళు. సినిమా మొదలుపెట్టినప్పుడే రిలీజ్ ఎప్పుడనేది చెప్పి ఆ డేట్ కే సినిమాను విడుదల చేస్తారు. ఈ ప్లానింగ్ లో మనకు 10 శాతం కూడా రాలేదనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే మనం సాధారణంగా రిలీజ్ డేట్ లు చెప్పం. ఒకవేళ చెప్పినా కూడా ఆ సమయానికి కచ్చితంగా రాదు. ఒక్కోసారి రెండు రోజుల్లో రిలీజ్ అంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటాయి. ముందురోజు ఫస్ట్ కాపీను సిద్ధం చేస్తారు. ఒక్కోసారి ఫస్ట్ కాపీ కూడా చూసే టైమ్ లేక అలాగే డ్రైవ్స్ పంపిస్తుంటారు. ఇన్నేళ్లు గడిచినా కూడా టాలీవుడ్ కు ఈ రకమైన క్రమశిక్షణ రాకపోవడం విడ్డూరమే.

అయితే వీటికి కొన్ని సినిమాలు మినహాయింపు. కనీసం నెల ముందైనా రిలీజ్ డేట్ చెప్పి ఆ సమయానికి సినిమాను సిద్ధం చేస్తారు. కానీ రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ డేట్ అన్నది తెలీకుండా అటు డిస్ట్రిబ్యూటర్లు కంగారు పెడుతోంది. ఇటు ప్రేక్షకులను కూడా అయోమయానికి గురి చేస్తోంది. అదే వెంకీ మామ. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా, పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న వెంకీ మామ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ లేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుండో సాగుతోంది. బడ్జెట్ కూడా ఓవర్ అయిందని వార్తలు వచ్చాయి.

ఈ ఇద్దరు హీరోల మార్కెట్ ను మించి 40 కోట్ల దాకా ఖర్చు జరిగిందట. ఇంకా షూటింగ్ పూర్తయిందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఇక రిలీజ్ డేట్ విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. నిర్మాతలకు కూడా తెలీడం లేదు అంటూ సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు. ఎందుకంటే వెంకీ మామను ముందు క్రిస్మస్ సెలవుల సందర్భంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాదు, సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా సంక్రాంతికి జనవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తామని, ఆ విధంగా రిలీజ్ కూడా సిద్ధపడమని నిర్మాతల నుండి కబురు వెళ్ళింది.

ఇది జరిగిన కొన్ని రోజులకు సంక్రాంతికి ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి కాబట్టి దాని బదులు సోలో రిలీజ్ చూసుకుంటే బెటర్ అని భావిస్తున్నట్లు న్యూస్ హల్చల్ చేసింది. నిజానికి ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు దగ్గర థియేటర్లు బానే ఉన్నాయి. పట్టుబట్టి రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఎందుకో సంక్రాంతి నుండి వెనకడుగు వేశారు. ఏ సినిమా పోటీ లేకుండా డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని భావించినట్లు న్యూస్ అందింది. పోనీ దానికైనా ఫిక్స్ అయ్యారా అంటే క్లారిటీ లేదు. డిసెంబర్ 12 అంటే నెల రోజులు కూడా లేదు. మరి ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అదే రోజున సినిమా వస్తుందా? ఏమో సురేష్ బాబు అండ్ టీమ్ కే తెలియాలి.