ప్రియాంక గాంధీ కాదు… ప్రియాంక చోప్రా

ప్రియాంక గాంధీ కాదు... ప్రియాంక చోప్రా
ప్రియాంక గాంధీ కాదు… ప్రియాంక చోప్రా

నా చిన్నప్పుడు మహత్మ అనే సినిమాలో మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు “ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ..!” అని రాస్తే ఫస్ట్ అర్ధం కాలేదు. తరువాత నిజంగానే కాదు అని తెలుసుకున్నాక మహానుభావుడు ఒక్క లైన్ లో అంత పెద్ద అర్ధం వచ్చేలా ఎలా రాసాడు రా అయ్యా..! అని అనుకుని దండం పెట్టుకున్నాను . రాజకీయాల కోసం దేశం లో ఇంటి పేర్లు అడ్డం పెట్టుకోవడం అనే ఒక చీప్ ట్రెండ్ మొదలుపెట్టిన బ్యాచ్ వీళ్ళే కదా.! ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కొత్త ట్రంప్ కార్డు ప్రియాంక వాద్రా … అదేలే ప్రియాంక విషయంలో కూడా జరిగింది.

ఆగండాగండి….. ఎం ప్రమాదం జరగలేదు. ప్రియాంక గాంధీకి గాని, ప్రియాంక చోప్రాకు గానీ ఎటువంటి నష్టం జరగలేదు. కనీసం ప్రియాంక గాంధీ సినిమాలు ఒప్పుకోలేదు, అలా అని చెప్పి ప్రస్తుతం హాలీవుడ్డు తప్ప మిగిలిన సినిమాలని కనీసం దేఖని మన ప్రియాంక చోప్రా కొత్తగా రాజకీయాల్లోకి కూడా రావట్లేదు. అసలేం జరిగిందంటే,.. ప్రస్తుతం కాలుష్యంతో కళకళలాడుతున్న మన దేశ రాజధాని దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టింది, ఆ మీటింగ్ కి దిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు సుభాష్ చోప్రా హాజరయ్యాడు. ఆ మీటింగ్ లో ఒక కాంగ్రెస్ స్థానిక నేత అయిన సురేంద్ర కుమార్ ప్రసంగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే తెలిసిందేగా…. పనికొచ్చేది ఏమీ లేకపోయినా… గాంధీల భజనకు మాత్రం లోటు ఉండదు.

ఆ ప్రసంగంలో భాగంగా సురేంద్ర కుమార్ చివరలో అలవాటుగా సోనియా గాంధీకి…. అన్నప్పుడు ఉన్నవాళ్లు అందరూ జై…. అని అన్నారు. ఆ తరువాత, రాహుల్ గాంధీకి అన్నప్పుడు కూడా అందరూ…. జై… అని అన్నారు. ఇక కొసమెరుపు ఏంటంటే ప్రియాంక గాంధీ అనబోయి, పొరపాటుగా ప్రియాంకా చోప్రా కి అని అనడం, కూర్చుని భజన చెయ్యడం అలవాటు అయిపోయిన జనం గుడ్డిగా, జై… అని అరవడం జరిగిపోయింది. ఆ తరువాత అందరూ నవ్వుకున్నారు. కానీ, ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ప్రియాంకా చోప్రా కాంగ్రెస్ లో ఎప్పుడు చేరారు.? అంటూ నెటిజన్లు అంతా ట్రోల్ చేస్తున్నారు. పోనీలే… ఎంతైనా భజన చెయ్యడానికి అలవాటు పడిన బానిస బతుకులు కదా.!