బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌పై క‌రోనా దెబ్బ‌!


బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌పై క‌రోనా దెబ్బ‌!
బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌పై క‌రోనా దెబ్బ‌!

ఫిల్మ్‌ ఇండ‌స్ట్రీకి క‌రోనా దెబ్బ గ‌ట్టిగా త‌గిలింది. అందులోనూ టాలీవుడ్ ఇండ‌స్ట్రీపై దీని ప్ర‌భావం మామూలుగా లేదు. కొత్త సినిమాలు లేవు… సెట్స్‌పై వున్న సినిమాలు ఆగిపోయాయి. ఎప్పుడు లాక్‌డౌన్ ముగుస్తుందో తెలియ‌దు. ఆగిపోయిన షూటింగ్‌లు ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలి‌య‌ని ప‌రిస్థితి. దీంతో సినిమా వాళ్ల‌లో ఆయోమ‌యం ఏర్ప‌డింది. క‌రోనా కార‌ణంగా అట్ట‌హాసంగా జ‌రుపుకునే పుట్టిన రోజు వేడుక‌ల్ని కూడా స్టార్స్ అవైడ్ చేయాల్సిన ప‌రిస్థితి.

తాజాగా స్టార్ హీరోలు పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్ విష‌యంలో రాజీప‌డాల్సి వ‌స్తోంది. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డేని సాదాసీదాగా జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 15న ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పుట్టిన రోజు జ‌ర‌గ‌బోతోంది. అయితే క‌రోనా కార‌ణంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు అభిమానులు దూరంగా వుండాల‌ని రామ్ కోరాల్సి వ‌స్తోంది. అభిమానుల్ని ఉద్దేశించి రామ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ని కూడా పెట్టారు.

`మీరు నాపై చూసించే ప్రేమ‌, అభిమానానికి నా మ‌న‌సులో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక స్థానం వుంటుంది. ప్ర‌తి ఏటా నా పుట్టిన‌రోజుని మీరు జ‌రిపే తీరు నాకు చాలా ఆనందాన్ని క‌లిగిస్తూ వుంటుంది. మీకు నాపై ఎంత ప్రేమ వుందో అంత‌కంటే ఎక్కువ‌గా నేను మిమ్మ‌ల్ని ప్రేమిస్తుంటాను. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీరు నా సంతోషం.  నా ఎన‌ర్జీ. నా ప్రాణం. అంత‌కు మించి నా బాధ్య‌త‌. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల రీత్యా ఈసారి నా పుట్టిన రోజు వేడుక‌ల‌కి మీరంతా దూరంగా వుండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సామాజిక దూరం అంద‌రికీ శ్రేయ‌స్క‌రం. ఈ ఒక్క‌సారి మీరు పాటించే ఈ దూర‌మే నాకు ఇచ్చే అస‌లైన పుట్టిన రోజు కానుక‌గా భావిస్తున్నాను` అన్నారు రామ్‌. ఇదే త‌ర‌హాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్‌ని అభ్య‌ర్థించ‌బోతున్నారు.

ఈ నెల 20న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కామ‌న్ డీపీని రిలీజ్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్  హంగామా మొద‌లైంది. త్వ‌ర‌లో ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం వుంది.  గ‌త ఏడాది ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ ప్ర‌మాద వ‌శాత్తు మృతి చెంద‌డంతో పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఎన్టీఆర్ దూరంగా వున్నారు.