
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా సోకిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్ ఇలా ప్రతీ ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో ముందుగానే తేరుకున్న జగన్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షల్ని నిర్వహించడం మొదలుపెట్టింది. కంటోన్మెంట్ జోన్లలో ఇప్పటికే లాక్డౌన్ విధించింది.
కరోనా తీవ్రత వున్న పలు జిల్లాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా బాధితులని టెస్టుల ద్వారా వేరు చేసి మరింత మందికి రాష్ట్రంలో వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏపీలో పాజిటివ్ కేసులు బుధవారం నాటికి 10, 884కు చేరింది. అయితే టెస్టుల విషయంలో పారదర్శకత పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రాలో 19,085 మందిని టెస్ట్ చేస్తే 553 మందికి కరోనా వచ్చింది అని తేలింది. ఇక తెలంగాణ లో 3,616 మందిని టెస్ట్ చేస్తే 920 మందికి కరోనా వచ్చింది అని తాజాగా తేలింది. దీంతో తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 11, 364కు చేరింది. ఇదిలా వుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న టెస్టుల పట్ల చాలా మంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఓ వ్యక్తికి టెస్టు చేస్తే నెగెటివ్ రావడం, అదే వ్యక్తి కి తెలంగాణలో టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం పట్ల ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది అర్థం కావడం లేదు. అంటే ఆంధ్ర లో కరోనా టెస్ట్ రిజల్ట్స్ కరెక్ట్ కాదా ? తెలంగాణ లో టెస్ట్ లు సరిగ్గా చెయ్యడం లేదా ? అని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుంటే కరోనా విజృంభిస్తూ జనాల ప్రాణాల్ని కబలిస్తున్న వేళ రాష్ట్రంలో, దేశంలో పార్టీల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకోవడం ప్రజల్లో పార్టీల పట్ల ఏహ్య భావన కలుగుతోంది. బీజేపీ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ టెస్టులు చేయడం లేదని తెరాసా, తెలంగాణలో తెరాస ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయించడం లేదని బీజేపీ వర్గాలు ప్రజల ప్రాణాల్ని గాలికొదిలేసి రాజకీయ విమర్శలకు దిగడం వింతగా వుందని జనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నారు.