అనిల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్ మధ్య చెడిందా?


అనిల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్ మధ్య చెడిందా?
అనిల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్ మధ్య చెడిందా?

చూస్తుంటే ఈ మధ్య దేవి శ్రీ ప్రసాద్ టైమ్ అసలు బాలేదు అనిపిస్తోంది. ఇప్పటిదాకా దేవితోనే పని చేస్తూ వచ్చిన హీరోలు, దర్శకులు కూడా ఇప్పుడు దేవికి మొహం చాటేస్తున్నారు. ఎప్పుడూ లేనిది గత సంవత్సరం నుండి దేవి పనితనంపై, రొటీన్ మ్యూజిక్ పై కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ తగ్గే ఔట్పుట్ ఏదీ దేవి నుండి రాకపోవడంతో ఇక హీరోలు, దర్శకులు దేవితో పనిచేయడం తగ్గించేశారు. ఇప్పటికే మెగా హీరోలు దేవిని పూర్తిగా సైడ్ చేసేసారు. చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ఎవరూ దేవితో పనిచేయట్లేదు. దర్శకుడిగా తన మొదటి సినిమా నుండి తనతో ట్రావెల్ అవుతోన్న దేవిని చిరంజీవి సినిమా కోసం పక్కన పెట్టేసాడు కొరటాల శివ. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

ఇవన్నీ పక్కన పెడితే దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పనిచేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు అనే సాంగ్ బిట్ ని వదలగా దానికి రొటీన్ అనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ కు, ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య చెడిందని అంటున్నారు. ట్యూన్స్ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు కుదరలేదని సమాచారం.

అనిల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్ ఇద్దరూ రీసెంట్ గా ఎఫ్ 2 కు కలిసి పనిచేసారు. అందులో పనితనం నచ్చి సరిలేరు నీకెవ్వరుకి కూడా దేవినే ఫిక్స్ చేసాడు అనిల్. మరి సరిలేరు నీకెవ్వరు విషయానికి వచ్చేసరికి ఎక్కడ తేడా వచ్చిందో అర్ధం కాని పరిస్థితి. అయితే మధ్యలో మహేష్ మధ్యవర్తిత్వం వల్లే ఈ సినిమా నుండి దేవి వాకవుట్ చేయకుండా తన పని పూర్తి చేస్తున్నాడట. మహేష్ బాబు ఒక్కోసారి ఒక్కొక్కళ్ళపై పూర్తి నమ్మకం పెట్టేసుకుంటాడు. ఆ ఫేజ్ లో వారితో పనిచేయడానికే ఇష్టపడతాడు. కెరీర్ మొదట్లో తన సినిమాలకు ఎక్కువగా మణిశర్మ పనిచేసేవాడు. ఇప్పుడు పూర్తిగా దేవి శ్రీ ప్రసాద్ వర్క్ చేస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్ లో 1 నేనొక్కడినే, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మహేష్ ప్రస్తుతం దేవిని పూర్తిగా నమ్ముతున్నాడు. అందుకే అందరూ పక్కనపెడుతున్నా కూడా దేవితోనే సరిలేరు నీకెవ్వరు చేయడానికి ఓకే అన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ – అనిల్ రావిపూడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినా కానీ మహేష్ సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. మరి సర్దుబాటు వ్యవహారం కాబట్టి దేవి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడోనన్న టెన్షన్ అభిమానుల్లో మొదలైంది. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, దేవి ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతాడని, తమన్నాతో రూపొందించిన స్పెషల్ సాంగ్ అయితే దేవి బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఏది నిజమైన వార్తో తెలియాలంటే ఆల్బమ్ విడుదలయ్యే దాకా వేచి చూడక తప్పదు.