దాసరి ఆశయాలకు కొనసాగింపుగా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్


Dasari Talent Academy short film contest

దర్శక రత్న-దర్శక శిఖరం స్వర్గీయ డాక్టర్  దాసరి నారాయణరావు ఆశయాలకు కొనసాగింపుగా..  కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయాలి, ప్రోత్సాహించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘దాసరి టాలెంట్ అకాడమీ‘ 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించింది.

 

ఈ వివరాలు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. జ్యూరీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ, దాసరి టాలెంట్ అకాడెమీ వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, జ్యూరీ మెంబర్స్ ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, సీనియర్ రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎస్.మల్లిఖార్జునరావు (పద్మాలయ మల్లయ్య) పాల్గొన్నారు.

మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో 15 నిమిషాల నిడివి తో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాలని, ప్రధమ బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 50 వేలు, మూడవ బహుమతిగా 25 వేలుతో పాటు..మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు ‘నీహార్ ఈ సెంటర్’ సౌజన్యంతో అందజేస్తామని బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ తెలిపారు. మార్చి 30 వరకు షార్ట్ ఫిల్మ్స్ స్వీకరిస్తామని, మే 5న బహుమతీ ప్రదాన సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

దాసరికి అత్యంత సన్నిహితులైన సూర్యనారాయణ చేపట్టిన ఈ పోటీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, తామంతా ముందుండి నడిపిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రాజా వన్నెం రెడ్డి, రాజేంద్రకుమార్,  పద్మాలయ మల్లయ్య పేర్కొన్నారు. ఈ పోటీకి నగదు బహుమతులు అందించేందుకు ముందుకొచ్చిన ‘నీహార్ ఈసెంటర్’ (niharecenter.com)వారిని వారు అభినందించారు. మరిన్ని వివరాలకుDasaritalentacademy.org లో లాగిన్ అవ్వాల్సిందిగా సూచించారు!!

English Title: Dasari Talent Academy short film contest