ఇప్పుడు దేవా కట్టా పరిస్థితేంటి?


Deva Katta
ఇప్పుడు దేవా కట్టా పరిస్థితేంటి?

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఒకటీ ఉంటే సరిపోదు. టాలెంట్ ఉన్నా కానీ పైకి రాలేని ఎంతోమందిని మనం ఉదాహరణగా చూపించవచ్చు. అలా అని వారిని అలా వదిలేయడానికి కూడా లేదు. ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుందో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం టాలెంటెడ్ దర్శకుడిగా పేరొందిన దేవా కట్టా తన విషయంలో రెండోది జరగాలని బలంగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే తన కెరీర్ ఇప్పుడు అధఃపాతాళానికి పడిపోయింది.

వెన్నెల చిత్రంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుని, ప్రస్థానం సినిమాతో విషయమున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవా కట్టా, ఆటోనగర్ సూర్య, డైనమైట్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో తన ఉనికిని కోల్పోయాడు. తన పేరు తీసుకొచ్చిన ప్రస్థానం సినిమాను అదే పేరుతో సంజయ్ దత్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిస్తే అది దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

రివ్యూలు బాగానే వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ లో మాత్రం ఘోరంగా ఉంది. మూడు రోజులకు గాను హిందీ ప్రస్థానం కేవలం మూడు కోట్ల గ్రాస్ వసూలు చేయగలిగింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కేవలం పది శాతం పెట్టుబడిని వెనక్కి తెస్తుంది అని అంటున్నారు. మరి ఇంత ఘోరమైన ప్లాప్ తిన్న దేవా కట్టా కెరీర్ ఇకపై ఎటు పోతుందో చూడాలి.