సుక్కూ మీద ప్రేమను మరోసారి బయటపెట్టిన దేవి


సుక్కూ మీద ప్రేమను మరోసారి బయటపెట్టిన దేవి
సుక్కూ మీద ప్రేమను మరోసారి బయటపెట్టిన దేవి

దేవి శ్రీ ప్రసాద్ దశాబ్దానికి పైగా తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. దేవి మ్యూజిక్ ఇస్తున్నాడంటే కచ్చితంగా ఆల్బమ్ చార్ట్ బస్టర్ అనే భావన అందరిలోనూ ఉండేది. అయితే గత రెండు, మూడేళ్ళ నుండి పరిస్థితిలో మార్పు వచ్చింది. దేవి అందించిన సంగీతం విమర్శల పాలవుతోంది. తను అందించిన పాటలు తుస్సుమంటున్నాయి. వరసగా ప్రతీ సినిమాకూ ఇదే జరుగుతుండడంతో దేవి పనైపోయిందన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవి అందించిన సంగీతంపై విమర్శలు వచ్చాయి. ఈ పాటలు బానే ఉన్నా కానీ దీనికి పోటీగా వచ్చిన అల వైకుంఠపురములో ని పాటలకు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో దాని ముందు ఈ పాటలు పూర్తిగా తేలిపోయాయి. దీంతో దేవి మరోసారి ఫోకస్ లోకి వచ్చాడు.

తనను తాను నిరూపించుకునే స్టేజ్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న దేవి ఒక అదిరిపోయే పాటతో మన ముందుకు వచ్చాడు. రీసెంట్ గా విడుదలైన నీ కళ్ళు నీలి సముద్రం అనే పాటకు రెస్పాన్స్ బాగుంది. సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఉప్పెన చిత్రంలోని పాట ఇది. కవాలి తరహాలో రూపొందిన ఈ పాట కొత్తగా ఉండి శ్రోతలను అలరిస్తోంది. శ్రీమణి అందించిన సాహిత్యానికి జావేద్ అలీ గొంతు కలిసి ఈ పాట వినేకొద్దీ వినాలనే రేంజ్ లో ఉంది. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ దాటేశాయి. చాలా రోజుల తర్వాత దేవి నుండి ఒక మంచి గీతం రావడంతో ఇటు ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీలవుతున్నారు.

సుకుమార్ అంటేనే దేవి చెలరేగిపోతాడు. సుకుమార్ – దేవి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉప్పెన చిత్రానికి సుకుమార్ ఒక నిర్మాత. అందుకే దేవి నుండి ఈ రేంజ్ లో పాట వచ్చింది అనేవాళ్ళు కూడా ఉన్నారు.