వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్న దేవినేని అవినాష్

Devineni Avinash jumps to YSRCP
Devineni Avinash jumps to YSRCP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిన్న మొన్నటి వరకు ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, పార్టీ పెట్టినప్పటి నుంచి, ఎప్పుడు ఎదురు కాని ఘోరపరాజయం ఎదురుకావడంతో, నిన్న మొన్నటి వరకు పసుపు జెండా పట్టుకొని, పసుపు చొక్కా వేసుకొని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పసుపు మయం చేయాలని కంకణం కట్టుకొని తిరిగిన తమ్ముళ్లు ఇప్పుడు ఆత్మరక్షణలో అంతర్మథనంలో పడిపోయారు.

దానికి తోడు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, వల్లభనేని వంశీ మోహన్, లాంటి నాయకులు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పుడు పసుపు పార్టీకి మరో షాక్ తగిలింది. విజయవాడ రాజకీయాలలో మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలలో చెప్పుకోదగిన గుర్తింపు తెచ్చుకున్న దివంగత నాయకుడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ తనయుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

దేవినేని అవినాష్ బుధవారం తన నివాసంలో తన అనుచరులు స్థానిక నాయకులు మరియు అభిమానులతో పెద్ద ఎత్తున విస్తృతస్థాయి సమావేశం అయ్యారు. మరొక రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత, మాజీ కార్పొరేటర్ కడియాల బుచ్చిబాబు ధృవీకరిస్తున్నారు.

దేవినేని అవినాష్ తండ్రి దివంగత దేవినేని రాజశేఖర్ నెహ్రూకు విజయవాడ రాజకీయాల పై మంచి పట్టు ఉండడంతో పాటు, పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు కూడా ఉంది. ఇప్పుడు దేవినేని అవినాష్ కు అదే బలం. గతంలో కూడా స్వర్గీయ ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు తో విభేదించి, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న దేవినేని రాజశేఖర్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇటీవలే మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలో కి మళ్ళీ వచ్చారు. తన బిడ్డ అవినాష్ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసమే, తాను మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని ఆయన ప్రజలకు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితమే ఆయన స్వర్గస్తులయ్యారు.
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు పరంగా, తనకు జరిగిన తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల దృష్ట్యా, అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ సాధించడమే లక్ష్యంగా, దేవినేని అవినాష్ గారి రాజకీయ కార్యాచరణ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు.