సినిమా ప్రమోషన్లకు హ్యాండిస్తున్న ధనుష్


సినిమా ప్రమోషన్లకు హ్యాండిస్తున్న ధనుష్
సినిమా ప్రమోషన్లకు హ్యాండిస్తున్న ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా తను చేసిన అసురన్ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లో కూడా స్థానం సంపాదించింది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు సినిమాలో ధనుష్ నటనకు బోలెడన్ని ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమాతో జాతీయ స్థాయి పురస్కారం లభించడం ఖాయమని కూడా అంటున్నారు. ధనుష్ ప్రస్తుతం తన తర్వాతి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ధనుష్ నటించిన సినిమా ఒకటి ఈ వారం విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా ప్రమోషన్లకు ధనుష్ హాజరుకావట్లేదు. అసలు ఈ సినిమా వస్తున్నట్లే తెలీనట్లు కనీసం ఎక్కడా స్పందించట్లేదు. అదే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దాని వివరాల్లోకి వెళితే..

ధనుష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాలుగేళ్ల కిందట ఎన్నై నొక్కి పాయుం తోటా అనే సినిమా ప్రకటించాడు. టాలెంటెడ్ దర్శకుడు, హీరో కలిసి చేస్తున్న ప్రయత్నం కాబట్టి బజ్ కూడా సూపర్బ్ గా ఉండేది. రెండేళ్ల క్రితమే ఈ సినిమాను పూర్తి చేసాడు గౌతమ్ మీనన్. అయితే విడుదలకు మాత్రం నోచుకోలేదు. విడుదల చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే జరిగాయి కానీ సినిమా విడుదల కాలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. ఫైనాన్షియర్ తో వచ్చిన ఆర్ధిక గొడవల నేపథ్యంలో ఈ సినిమా విడుదల కావట్లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే గౌతమ్ మీనన్ ఒక నిర్మాత సహకారంతో అన్ని ఇబ్బందుల నుండి బయటపడి ఇప్పుడు సినిమా విడుదల చేస్తున్నాడు.

పాత ప్రోడక్ట్ కావడంతో సహజంగానే ఈ చిత్రంపై ఇప్పుడు బజ్ పెద్దగా లేదు. అలాంటప్పుడు ధనుష్ కదిలివచ్చి స్వయంగా ప్రమోషన్స్ చేసి సినిమాను లేపడానికి ప్రయత్నించవచ్చు. అయితే అటువంటిది ఏం ధనుష్ చెయ్యట్లేదు. బయటకొచ్చి ప్రమోషన్స్ కాదు కదా కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించట్లేదు. దీంతో గౌతమ్ మీనన్ ఒక్కడే సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. గౌతమ్ మీనన్ తో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్ని గొడవలు ఉన్నా అసలే బజ్ లేని సినిమాను బ్రతికించాల్సిన అవసరం హీరోకు ఉందనేది కొందరి వాదన. సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటే అప్పుడైనా ధనుష్ ముందుకు వస్తాడేమో. ఇదే సినిమా తెలుగులో తూటా పేరుతో విడుదలవుతోంది.