వెంకీ మామ రిలీజ్ డేట్ వెనకాల దిల్ రాజు మంత్రాంగం


వెంకీ మామ రిలీజ్ డేట్ వెనకాల దిల్ రాజు మంత్రాంగం
వెంకీ మామ రిలీజ్ డేట్ వెనకాల దిల్ రాజు మంత్రాంగం

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న వెంకీ మామ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎంతలా కన్ఫ్యూజన్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముందుగా దసరా అనుకున్నారు. వెంకీకు గాయమవడంతో ఆ డేట్ కుదర్లేదు. తర్వాత దీపావళి అనుకున్నారు, కానీ సమయానికి బాబీ సినిమాను పూర్తి చేయలేకపోయాడు. సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ అవుతుంది అని సంకేతాలిచ్చారు కానీ అది కూడా అవ్వలేదు. అప్పటికే నాలుగు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవడంతో వెంకీ మామకు స్కోప్ లేకుండా పోయింది. అందుకే క్రిస్మస్ కు దిగారు. ఇక్కడ కూడా వెంటనే ఏ విషయం తేల్చలేదు. కొద్ది రోజులు డిసెంబర్ 25 అన్నారు, కొద్ది రోజులు డిసెంబర్ 13 అన్నారు. అటూ ఇటూ ఊగిసలాడి చివరికి డిసెంబర్ 25న ఓకే అని అందరూ అనుకుంటున్న సమయంలో లేదు డిసెంబర్ 13 అంటూ అందరికీ షాక్ ఇచ్చారు. అయితే సురేష్ బాబు డిసెంబర్ 13న సినిమా విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనకాల దిల్ రాజు మంత్రాంగం ఉందని తెలుస్తోంది.

వెంకీ మామను మొదట వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13నే విడుదల చేద్దామనుకున్నారు సురేష్ బాబు. అయితే డిస్ట్రిబ్యూటర్లు అందుకు సమ్మతించలేదు. వారంలో క్రిస్మస్ రిలీజ్ పెట్టుకుని నాన్ హాలిడే సీజన్ లో రిలీజ్ చేయడం ఎందుకు అన్న భావన వ్యక్తపరిచారు. పైగా డిసెంబర్ 13 అంటే ఇంకా సీజన్ డల్ గానే ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బంది ఉంటుందని భారీ రేట్లకు సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు భావించారు. దీంతో సురేష్ బాబు కూడా ఇక డిసెంబర్ 25కె ఫిక్స్ అయిపోదామనుకున్నాడు.

సరిగ్గా అప్పుడే దిల్ రాజు రంగంలోకి దిగాడు. దిల్ రాజు, సురేష్ బాబులకు మంచి అనుబంధం ఉన్న విషయం తెల్సిందే. ఇద్దరూ రిలీజ్ డేట్ ల విషయంలో ఇప్పటికే ఒకరి కోసం ఒకరు కంప్రమైజ్ అయ్యారు.. ఈ చనువుతోనే దిల్ రాజు, సురేష్ బాబును రిక్వెస్ట్ చేసాడట. డిసెంబర్ 25న తమ సినిమా ఇద్దరి లోకం ఒకటే సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నట్లు తెలిపాడు దిల్ రాజు. ఈ సీజన్ మిస్ అయితే తమ సినిమాకు చాలా ఇబ్బంది అవుతుందని, డిసెంబర్ 13న ఏమాత్రం క్రేజ్ లేని ఇద్దరి లోకం ఒకటేను రిలీజ్ చేయలేమని, ఇక క్రిస్మస్ కూడా మిస్ అయితే మళ్ళీ ఏ ఫిబ్రవరికో విడుదలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే ఒక సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు తెలిపాడు దిల్ రాజు.

వెంకీ మామకు ఎలాగు బజ్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ 13న రిలీజ్ చేస్తే అదే రోజు నుండి మార్కెట్ ఊపందుకుంటుందని, అది తర్వాత సినిమాలకు కూడా ఉపయోగపడుతుందని దిల్ రాజు, సురేష్ బాబును ఒప్పించాడట. అందుకే సురేష్ బాబు మొదట డిసెంబర్ 25 న విడుదల చేద్దామని అనుకున్నా చివరికి డిసెంబర్ 13న ఫిక్స్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే.