దిల్ రాజు మెడకు చుట్టుకున్న సరిలేరు, అల వైకుంఠపురములో విడుదల తేదీ వివాదం


dil raju negotiations with sarileru neekevvaru and ala vaikunthapuramulo makers
dil raju negotiations with sarileru neekevvaru and ala vaikunthapuramulo makers

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల తేదీ విషయంలో రాద్ధాంతం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు మొదట జనవరి 12న విడుదల చేద్దామని భావించడం, తర్వాత సరిలేరు నీకెవ్వరు ఒకరోజు ముందుకు రావడం వంటి విషయాల తర్వాత అన్నీ సద్దుమణిగాయి అని భావించారు. అయితే రిలీజ్ డేట్ కు మరో పది రోజులు ఉందనగా ఈ రెండు చిత్రాలు రిలీజ్ డేట్ ల విషయంలో మళ్ళీ మొదటికి వచ్చాయి.

అల వైకుంఠపురములో 12న విడుదల నుండి ముందుకు వచ్చి 10 లేదా 11న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సరిలేరు నిర్మాతలు కూడా అల వైకుంఠపురములో బట్టి తమ రిలీజ్ డేట్ ను ప్లాన్ చేసుకుందామని భావిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ల జగడం ఇప్పుడు దిల్ రాజు మెడకు చుట్టుకుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాల నైజాం, వైజాగ్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు వద్దే ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 33 కోట్లు పెట్టుబడి పెట్టిన దిల్ రాజు, అల వైకుంఠపురములో విషయంలో 26 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ల విషయంలో గొడవ, దిల్ రాజు 59 కోట్ల పెట్టుబడికి ఎసరు పెట్టేలా ఉంది. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం వల్ల రెండూ సినిమాలకూ చేటు జరుగుతుంది. అందుకే దిల్ రాజు ఇప్పుడు రంగంలోకి దిగి ఇరు నిర్మాతలతో చర్చలకు దిగినట్లు తెలుస్తోంది. మొన్నటి నుండి ఇవి నడుస్తుండగా ఏ విషయం తేలలేదు. అయితే ఈరోజు ఫైనల్ గా మరోసారి దిల్ రాజు సమక్షంలో నిర్మాతల మీటింగ్ ఉండనుందని, ఈరోజుతో ఏ డేట్ అనేది క్లారిటీ రానుందని సమాచారం.

ఏదేమైనా ఈ మీటింగ్ వల్ల రెండు భారీ చిత్రాలకు మంచే జరుగుతుందని కోరుకుందాం. ఎందుకంటే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలపై దాదాపు 220 కోట్ల బిజినెస్ నడుస్తోంది.