పవన్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న దిల్ రాజు

పవన్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న దిల్ రాజు
పవన్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీగా చేస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మాములుగా అయితే మే 15న విడుదలవ్వాలి. కానీ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలు షూటింగ్ జరగలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమా షూటింగ్ ల విషయంలో సానుకూలంగా స్పందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆనందం విరిసింది. ప్రభుత్వం నుండి విధివిధానాలు రాగానే షూటింగ్ ను చకచకా మొదలుపెట్టేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఈ విషయంలో అగ్ర నిర్మాత దిల్ రాజు అందరికంటే ముందున్నాడు.

జూన్ నుండి మళ్ళీ తిరిగి వకీల్ సాబ్ షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ను జూన్ నుండి డేట్స్ ఇమ్మని రిక్వెస్ట్ చేసాడు కూడా. పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వకీల్ సాబ్ కు ఇంకా 30 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అందులో కోర్టు సీన్స్ ఎక్కువగా షూట్ చేయాల్సిన అవసరం ఉంది. సో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా రెండు షిఫ్ట్స్ లో షూటింగ్ ను పూర్తి చేస్తే ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని త్వరగా తీసుకురావచ్చు. ప్రస్తుతానికి దసరా అనుకుంటున్నారు కానీ వీలైనంత తొందరగా షూటింగ్ ను ముగించాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు షూటింగ్స్ మొదలుపెట్టుకోమంటే అప్పటి నుండి స్టార్ట్ చేసేలా సర్వం సిద్ధం చేస్తున్నాడు. దిల్ రాజు టీమ్ ఇప్పటికే వకీల్ సాబ్ కాస్ట్ అండ్ క్రూ కు జూన్ నుండి షూట్ కు సిద్ధం కమ్మని సమాచారమందించిందట. వేణుశ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.