దిల్ రాజు గ్యాంబుల్ భలేగా వర్కౌట్ అయిందిగా

దిల్ రాజు గ్యాంబుల్ భలేగా వర్కౌట్ అయిందిగా
దిల్ రాజు గ్యాంబుల్ భలేగా వర్కౌట్ అయిందిగా

ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు ప్రయాణం ఈరోజు ఒక అగ్ర నిర్మాత స్థాయికి ఎదిగిందంటే దానికి ఆయన కృషి, పట్టుదల, ప్లానింగ్ ప్రధాన కారణాలు. ఈ సంక్రాంతికి దిల్ రాజు హవా బాగా నడిచింది. పండగకు విడుదలైన నాలుగు సినిమాల నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఇది చాలా మందికి అత్యాశగా అనిపించవచ్చు. కానీ దిల్ రాజు ఈ నాలుగు చిత్రాలతో గ్యాంబ్లింగ్ ఆడాడు అన్నది మాత్రం నిజం. సంక్రాంతికి సినిమాల పోటాపోటీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ల మధ్య తరచూ పేచీలు ఉంటూనే ఉంటాయి. కానీ అన్ని చిత్రాలకు ఒకే డిస్ట్రిబ్యూటర్ అయితే ఏ గొడవా ఉండదు. సినిమాల పెర్ఫార్మన్స్ బట్టి థియేటర్లను అటూ ఇటూ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి దిల్ రాజు చేసింది కూడా అదే.

నాలుగు సినిమాల హక్కులను చేజిక్కించుకోవడం ద్వారా తన వద్దే కంట్రోల్ ఉంచుకున్నాడు. ముందుగా 9న దర్బార్ కు బెస్ట్ రిలీజ్ వచ్చేలా చూసాడు. ఈ సినిమా నైజాంలో మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత రెండు రోజులకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ సాధ్యమయ్యేలా చూసాడు. ఆ సినిమా మొదటి రోజే నైజాంలో 9 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టుకుంది. దాదాపు 40 శాతం బిజినెస్ తొలిరోజే చేసేయడంతో దిల్ రాజు ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అల వైకుంఠపురములో పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుని థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా ఆఖరున విడుదలైనా దానికి కూడా మంచి రిలీజ్ వచ్చేలా చూసుకున్నాడు. రెండు రోజులకు ఈ చిత్రం కోటిన్నర పైన వసూలు చేయగలిగింది. ఈ రకంగా నాలుగు చిత్రాలకు కూడా బెస్ట్ రిలీజస్ ఇచ్చాడు దిల్ రాజు.

బిజినెస్ పరంగా కూడా లాభమే జరిగింది. అల వైకుంఠపురములో చిత్రం ద్వారా భారీ లాభాలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు కూడా మంచి ప్రాఫిట్స్ అందిస్తోంది. రెండు పెద్ద చిత్రాల ద్వారా లాభాలు రావడంతో మిగతా రెండు సినిమాల ద్వారా వచ్చిన నష్టాన్ని ఈజీగా పూడ్చగలిగాడు.