ఆ క్రేన్ నాపై ప‌డినా బాగుండేది: శ‌ంక‌ర్‌


Director Shankar Sensational Tweet on Crane Accident
Director Shankar Sensational Tweet on Crane Accident

చెన్నైలోని ఓ స్టూడియోలో ఏర్పాటు చేసిన బ్లూ మాట్ పై `ఇండియ‌న్ 2` కోసం శంక‌ర్ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో క్రేన్ విగిరిప‌డి ముగ్గురు సిబ్బంది దారుణంగా ప్ర‌మాదానికి గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది. క‌మ‌ల్‌, కాజ‌ల్‌ల‌పై కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్న వేళ శంక‌ర్‌తో పాటు క‌మ‌ల్‌, కాజ‌ల్ ఈ ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌టప‌డ్డార‌ట‌.

అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ద‌క్షిణాదికి చెందిన స్టార్స్ చాలా వ‌ర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించి త‌మ బాధ‌ని వ్య‌క్తం చేశారు. క‌మ‌ల్‌హాస‌న్ స్పందించి బాధితుల కోసం కోటి ఆర్థిక స‌హాయాన్ని అందిస్తాన‌న్నారు. కాజ‌ల్, ర‌కుల్, అల్లు అర్జున్‌, సూర్య‌.. ఇలా చాలా మంది సెల‌బ్రిటీలు ఈ దుర్ఘ‌ట‌న‌పై స్పందించారు  కానీ ద‌ర్శ‌కుడు శంక‌ర్ మాత్రం మౌనంగా వుండిపోయారు. బుధ‌వారం మౌనాన్ని వీడి ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు.

`అత్యంత శోకాత‌ప్త హృద‌యంతో స్పందిస్తున్నాన‌ని, ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి షాక్‌లో వుండిపోయాన‌ని, ఎన్నో నిద్ర‌లేని రాత్రుల్ని గ‌డిపాన‌ని ఉద్వేగంగా స్పందించారు. ఈ ప్ర‌మాదంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ని, తోటి సిబ్బందిని పోగొట్టుకున్నాని, ఈ ప్ర‌మాదం నుంచి తాను తృటిలో త‌ప్పించుకున్నాన‌ని, ఆ క్రేన్ త‌న‌పైన ప‌డినా బాగుండేద‌ని, బాధిత కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కి ఆ భ‌గ‌వంతుడు అండ‌గా వుండాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను` అన్నారు. శంక‌ర్ చేసిన ఈ భావోద్వేగ ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.