సీక్వెల్‌ని కూడా మొద‌లుపెట్టొచ్చ‌ట‌!


సీక్వెల్‌ని కూడా మొద‌లుపెట్టొచ్చ‌ట‌!
సీక్వెల్‌ని కూడా మొద‌లుపెట్టొచ్చ‌ట‌!

మాస్ రాజా ర‌వితేజ ఏడాది విరామం త‌రువాత సినిమాల విష‌యంలో జోరు పెంచారు. నేల టిక్కెట్‌, అమ‌ర్ అక్బర్ ఆంటోని వ‌రుస ప‌రాజ‌యాల త‌రువాత ఏడాది విరామం తీసుకున్న ర‌వితేజ ఒకేసారి రెండు చిత్రాల్ని ప‌ట్టాలెక్కించారు. వి.ఐ. ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `డిస్కోరాజా`, గోపిచంద్ మ‌లినేనితో `క్రాక్‌` చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో వి.ఐ. ఆనంద్‌తో చేస్తున్నా `డిస్కోరాజా` ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇందులో రెట్రో లుక్‌లో క‌నిపిస్తున్న ర‌వితేజ గెట‌ప్‌కు సంబంధించిన స్టిల్స్‌, ఈ చిత్ర టీజ‌ర్ ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాల్ని క్రియేట్ చేసేసింది. 90వ ద‌శ‌కంలో త‌న‌దైన డిస్కో మ్యూజిక్‌తో యుర‌త‌రాన్ని ఉర్రూత‌లూగించిన డిస్కోకింగ్ బ‌ప్పీల‌హిరి ఈ చిత్రం కోసం ర‌వితేజ‌తో క‌లిసి ఓ పాట‌ని పాడారు. ఈ పాట కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా చేసే ఆలోచ‌న వుంద‌ని హీరో ర‌వితేజ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక‌ని చిత్ర బృందం నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్భ‌ఢంగా హీరో ర‌వితేజ ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల్ని వెల్ల‌డించారు. చిన్న‌త‌నం నుంచి తాను చూసిన పాత్ర‌ల్నిజోడించి ఈ చిత్ర క‌థని ద‌ర్శ‌కుడు ఆనంద్ మలిచార‌ని, దాంతో మరో ఆలోచ‌న లేకుండా ఈ చిత్రాన్ని అంగీక‌రించాన‌ని, అన్నీ స‌వ్యంగా కుదిరితే ఈ చిత్రానికి సీక్వెల్‌ని కూడా తెర‌పైకి తీసుకొచ్చే ఆలోచ‌న వుంద‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేశారు. త‌మ‌న్‌తో త‌న‌కిది 11వ సినిమా అని, ఇప్ప‌టికే పాట‌లు మంచి విజ‌యాన్ని సాధించాయ‌ని, అదే స్థాయిలో సినిమా కూడా ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం వుంద‌ని స్ప‌ష్టం చేశారు.