దొంగ మూవీ రివ్యూ


దొంగ మూవీ రివ్యూ
దొంగ మూవీ రివ్యూ

న‌టీన‌టులు: కార్తి, జ్యోతిక‌, స‌త్య‌రాజ్‌, నిఖిలా విమ‌ల్‌, బాల‌, నెడుముడి వేణు త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం: జీతూ జోసెఫ్‌,
నిర్మాత‌: రావూరి వి. శ్రీ‌నివాస్‌
సంగీతం: గోవింద్ వ‌సంత‌
విడుద‌ల తేదీ: 20-12-2019
రేటింగ్: 2.5/5

కార్తి న‌టించిన చిత్రాలకు తెలుగులో మంచి క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. `ఖాకీ` వంటి హిట్ సినిమా త‌రువాత వ‌రుస ఫ్లాప్‌లని సొంతం చేసుకున్న కార్తి ఇటీవ‌ల వ‌చ్చిన `ఖైదీ` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకున్నారు. ఈ సినిమా త‌రువాత స్వల్ప విరామం అనంత‌రం కార్తి నుంచి వ‌స్తున్న చిత్రం `దొంగ‌`. `దృశ్యం` ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే వున్నాయి. తొలిసారి కార్తి వ‌దిన జ్యోతిక‌తో క‌లిసి ఈ చిత్రంలో న‌టించారు. దీంతో ఇద్ద‌రి పాత్ర‌లు తెర‌పై ఎలా వుండ‌బోతున్నాయి అనే ఆస‌క్తి అంద‌రిలోనూ ఏర్ప‌డింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ‌గా తెర‌పైకొచ్చిన `దొంగ‌` ఆశించిన స్థాయిలోనే ఆక‌ట్టుకుందా? లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
విక్కీ( కార్తి) ఓ చిల్ల‌ర దొంగ‌. గోవాలో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేస్తూ లైఫ్‌ని జాలీగా గ‌డిపేస్తుంటాడు. అదే స‌మ‌యంలో 15 ఏళ్ల క్రితం త‌ప్పిపోయిన త‌న కొడుకు శ‌ర్వా కోసం తండ్రి జ్ఞాన‌మూర్తి( స‌త్య‌రాజ్‌), అక్క పార్వ‌తి( జ్యోతిక) వెతుకుతుంటారు. స్వ‌త‌హాగా ధ‌న‌వంతులైన వీరి ఇంటికి చిల్ల‌ర దొంగ విక్కీని శ‌ర్వాగా మార్చి గోవా పోలీస్ అధికారి జీవానంద్ (ఇళ‌వ‌ర‌సు) పంపిస్తాడు. జ్ఞాన‌మూర్తి కుటుంబంలోకి ప్ర‌వేశించిన విక్కీ అక్క‌డ ఎలాంటి సంఘ‌ట‌న‌ల్ని ఎదుర్కొన్నారు? అత‌నిని ఆ కుటుంబం శ‌ర్వాగా విక్కీని న‌మ్మిందా? ఇంత‌కీ శ‌ర్వా ఏమైయ్యాడు? . చివ‌రికి జ్ఞాన‌మూర్తి, పార్వ‌తి, విక్కీల క‌థ ఎలా సుఖాంత‌మైంది అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన ఇతివృత్తం.

న‌టీన‌టుల న‌ట‌న‌:
ఇటీవ‌ల `ఖైదీ` సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కార్తి ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌ని కొన‌సాగించ‌డానికి త‌న త‌దుప‌రి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. గోవాలో చిల్ల‌ర దొంగ‌గా, జ్ఞాన‌మూర్తి ఇంట్టో త‌ప్పిపోయి 15 ఏళ్ల త‌రువాత తిరిగొచ్చిన కొడుకుగా రెండు పార్శాల్లోనూ త‌న పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించారు. తొలి భాగంలో కార్తి త‌న‌దైన టైమింగ్‌తో న‌వ్వులు పూయించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ద్వితీయ భాగంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు భావోద్వేగ భ‌రిత స‌న్నివేశాల్లోనూ ఆక‌ట్టుకున్నారు, సినిమాలో కార్తి త‌రువాత ప్రాముఖ్య‌త వున్న పాత్ర‌లో స‌త్య‌రాజ్ క‌నిపించారు. భిన్న పార్శాల్లో త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి మ‌రోసారి ఔరా అనిపించారు. జ్యోతిక పాత్ర‌కు ఫ‌స్ట్‌హాఫ్‌లో ఏ మాత్రం ప్రాధాన్య‌త ల‌భించ‌లేదు. కానీ ప‌తాక ఘ‌ట్టాల్లో మాత్రం జ్యోతి త‌నేంటో మ‌రోసారి చూపించింది. గోవా పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన ఇళ‌వ‌ర‌సు త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించారు. క‌థానాయిక‌గా న‌టించిన నిఖిలా విమ‌ల్
పాత్ర స‌హ‌జంగా సాగింది. అయితే ఆమెకు సెకండ్ హాఫ్‌లో అంత ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు:
సంగీత ద‌ర్శ‌కుడు గోవింద్ వ‌సంత అందించిన పాట‌లు బాగున్నాయి కానీ ఆర్ ఆర్ అంత‌గా ఆక‌ట్టుకునే విధంగా లేక‌పోవ‌డం కొంత డ్యాబ్యాక్‌. హిల్ స్టేష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి ఆర్‌.డి. రాజ‌ఠ‌శేఖ‌ర్ అందించిన ఫొటోగ్ర‌ఫీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. స‌స్పెన్స్ ప్ర‌ధానంగా సాగిన ఈ చిత్రానికి రెన్సిల్ డిసిల్వా, స‌మీర్ అరోరా, జీతూ జోసెఫ్ అందించిన స్క్రీన్‌ప్లే హైలైట్ అని చెప్పొచ్చు. `దృశ్యం` వంటి థ్రిల్ల‌ర్ చిత్రాన్ని తెకెక్కించిన ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని కూడా అదే పంథాలో రూపొందించి స‌క్సెస‌ అయ్యారు. సినిమాలో త‌న‌దైన మార్కు స్క్రీన్‌ప్లేతో ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. జ్యోతిక పాత్ర‌ని మాత్రం ఆయ‌న నిర్ల‌క్ష్యం చేశారా? లేక ఎడిటింగ్‌లో తీసేశారా అన్న‌ది అర్థం కాలేదు. జ్యోతిక పాత్ర నిడివి పెంచితే బాగుండేది.

చివ‌ర‌గా:
`ఖైదీ` వంటి ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన కార్తి తాజా సినిమా `దొంగ‌`కు కూడా అదే త‌ర‌హా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకుని మ‌రోసారి ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. తొలి భాగంలొ దొంగ‌గా అల‌రించిన కార్తి రెండ‌వ భాగాన్ని కూడా త‌న భూజాల‌పైనే వేసుకుని సినిమాని ఆద్యంతం ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. అయితే `ఖైదీ` త‌ర‌హాలో ఈ చిత్రంలో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేక‌పోవ‌డం కొంత నిరాశ క‌లిగించే అంశం. స్ట్రెయిట్ చిత్రాల మ‌ధ్య విడుద‌లైన `దొంగ‌` ఎంత వ‌ర‌కు నిల‌బ‌డుతుంద‌న్న‌ది వీకెండ్ వ‌ర‌కు వేచి చూస్తే కానీ తెలియ‌దు.

పంచ్ లైన్: `దొంగ‌` ఓ ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్‌.


REVIEW OVERVIEW
దొంగ
SHARE