సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న తెలుగమ్మాయిEesha Rebba looking for break
Eesha Rebba looking for break

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంటుంది కొంతమంది పరిస్థితి. ఎంత ప్రయత్నిస్తున్నా ఎందుకో పనులు సక్రమంగా జరగవు. ప్రస్తుతం మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. ఈమె నటించే సినిమాలు హిట్ అవ్వవో లేక హిట్ అవ్వని సినిమాలు అన్నీ ఈమె ఏరికోరి ఎన్నుకుంటుందో తెలీదు కానీ ఈషా రెబ్బ ప్రస్తుతం క్రేజ్ కోసం పాకులాడుతోంది. అసలే తెలుగు అమ్మాయి కావడంతో ఆమెకు అవకాశాలిచేవాళ్లే కరువయ్యారు. ఇదివరకంటే తెలుగు హీరోయిన్లు మడికట్టుకుని కూర్చునే వారు కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అవసరాన్ని బట్టి తెలుగు హీరోయిన్లు కూడా గ్లామరస్ గా కనిపించడానికి సై అంటున్నారు. అవసరాన్ని బట్టి పట్టూ విడుపూ ప్రదర్శిస్తున్నారు. ఈషా రెబ్బ ఈ లిస్ట్ లో ముందే ఉంటుంది. మొదటి సినిమాల్లో పద్దతిగానే కనిపించిన ఈషా రాను రాను రాటుదేలింది. గ్లామరస్ గా కనిపించడానికి సై అంటోంది. తనని హాట్ హీరోయిన్ అంటేనే ఆనందిస్తానని ఆమె పేర్కొంటోంది. ఇంత బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా కానీ ఈషాకు వచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.

ఎన్టీఆర్ సరసన అరవింద సమేత చిత్రంలో ఆమె నటించిన వచ్చిన గుర్తింపంటూ ఏం లేదు. పెద్ద సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని చిన్న సినిమాలవైపు షిఫ్ట్ అవుతుంటే అవి మరీ దారుణంగా దెబ్బేస్తున్నాయి. రీసెంట్ గా ఈషా నటించిన రాగల 24 గంటల్లో దారుణమైన ఫలితాన్ని అందుకుంది ఈషా. ఇందులో ఆమెకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. అలాగే గ్లామరస్ గానూ కనిపించింది ఈషా. అయినా సినిమా ప్లాప్ కావడంతో ఈషా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది పరిస్థితి. గతంలో ఆమె చేసిన సుబ్రమణ్యపురం, బ్రాండ్ బాబు సినిమాలు కూడా అస్సలు ఆడలేదు. దీంతో ఈమెకు ప్లాప్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది.

అసలే అవకాశాలు అంతంతమాత్రంగా వస్తున్న సమయంలో ఇలా ఆమె నటించిన అరాకొరా సినిమాలు కూడా ప్లాప్ అవుతుంటే ఇక అవకాశాలు ఇచ్చేదేవరు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. అయినా కానీ ఈషా రెబ్బ మాత్రం తన వంతు ప్రయత్నాలు మానుకోవడం లేదు. ఫోటోషూట్లతో సైతం రెచ్చిపోతోంది ఈషా. ఒక స్టార్ హీరోయిన్ చేసే గ్లామరస్ ఫోటోషూట్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఇవి ఉంటున్నాయి. మరి ఈషాకు సరైన అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసే దర్శకులెవరో చూడాలి.