
అప్పుడెప్పుడో మా గురువుగారు రాంగోపాల్ వర్మ గారు చెప్పినట్లు “ఒకడి కామెడీ ఇంకొకడికి ట్రాజెడీ గా” అనిపిస్తుంది. మరొకటి ట్రాజెడీ ఒకరికి కామెడీగా అనిపిస్తుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ విషయంలో పైన చెప్పుకున్న డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. ఒక సంస్థగా బి.ఎస్.ఎన్.ఎల్ అందించిన సేవలు గురించి చెప్పాలంటే ఈ ఆర్టికల్ సరిపోదు.
మిగిలిన టెలికాం సంస్థలు అన్ని ఉద్యోగుల గొంతు మీద కూర్చుని పని చేయించుకుంటే, బిఎస్ఎన్ఎల్ లో మాత్రం ఉద్యోగాలు చేసేవాళ్ళు “పని తక్కువ – పంచాయితీ ఎక్కువ” అన్నట్లు ఉండేవాళ్ళు. ఉదాహరణకి సిమ్ లు అమ్మడానికి మిగిలిన ప్రైవేటు టెలికాం సంస్థ యొక్క ఉద్యోగులందరూ టెంట్లు వేసుకుని, రోడ్డు మీద కూర్చొని, చెట్ల కింద కూర్చొని బాధలు పడుతుంటే, బిఎస్ఎన్ఎల్ లో మాత్రం అమ్మే, ఒకటి రెండు సిమ్ కార్డులకు కూడా A.C ఆఫీస్.
ఫోను బిల్లు విషయంలో కూడా మిగిలిన టెలికాం సంస్థలు పోస్ట్ పెయిడ్ బిల్లును గట్టిగా మాట్లాడితే, ఇంటికి వచ్చి కస్టమర్ దగ్గర తీసుకొని వెళ్లే పరిస్థితులు ఉన్నప్పుడు; బిఎస్ఎన్ఎల్ కి మాత్రం బిల్లు కట్టాలంటే వెళ్లి లైన్లో నుంచొని అదికూడా గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్స్ ప్రకారం జరిగేది.
బయట మిగిలిన టెలికాం సంస్థలు సేవలు, సౌకర్యాలు మరియు టెక్నాలజీ విషయంలో ముందుకు వెళుతూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం అదే పాతచింతకాయ పద్దతులు పట్టుకొని వేలాడుతోంది. ఎందుకంటే ఒళ్ళు వంచి పనిచేయడానికి ప్రతి వాడికి బద్ధకం. ఒకటో తారీకు వచ్చినప్పుడల్లా జీతం వస్తుంది కదా అన్న ధీమా.
బ్యాక్ గ్రౌండ్ లో ఎక్కడో “నీ పాపం పండెను నేడు” అన్న పాట ఒకసారి కోరస్ గా వినపడుతూ ఉండగా, ఒక శుభ దినాన, ప్రతి నెలా, లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ పని మాత్రం చేయకుండా కాలక్షేపం చేసే వృద్ధ కపోతాలను “మర్యాదగా మింగేయ్యండి” అని బిఎస్ఎన్ఎల్ చెప్పింది. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని దయచేయండి అన్నట్లు.
ఆ నిర్ణయం ఇప్పుడు కొంత మంది ఉద్యోగుల పాలిట వరంగా మారింది. ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం, పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కనుక 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఉద్యోగి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కనీసం అతనికి మిగిలిన పది సంవత్సరాల జీవితం కింద దాదాపు 90 లక్షలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన సెటిల్మెంట్ తాలుకు డబ్బులు మళ్లీ అదనంగా వస్తాయి. ఇన్ని లాభాలు ఇందులో ఉన్నాయి కనుక, బి.ఎస్.ఎన్.ఎల్ లో పనిచేసే 16 లక్షల మందిలో సుమారు 80వేల మంది ఒకేసారి వాలంటరీ రిటైర్మెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు.
బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం వి.ఆర్.ఎస్ తో పాటు, కంపెనీ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఎలాగు వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇదే సందర్భంగా బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థని మళ్లీ లాభాల బాట పట్టిస్తానని మన కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభ సాక్షిగా హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.