నితిన్ భారీ ప్రాజెక్ట్ కు అన్నీ సిద్దమైనట్లేనా?


నితిన్ భారీ ప్రాజెక్ట్ కు అన్నీ సిద్దమైనట్లేనా?
నితిన్ భారీ ప్రాజెక్ట్ కు అన్నీ సిద్దమైనట్లేనా?

యంగ్ హీరో నితిన్ వరస ప్లాపుల నుండి భీష్మ చిత్రంతో బయటపడ్డాడు. ఈ సినిమా ఆఫ్ సీజన్ లో విడుదలైనా కానీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం నితిన్ కెరీర్ కు మళ్ళీ ఊపునిచ్చింది. నితిన్ వరస ప్రాజెక్టులను సెట్ చేసుకున్న నేపథ్యంలో భీష్మ విజయం కచ్చితంగా లైన్లో ఉన్న మిగతా దర్శకులకు ఊరటనిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భీష్మ తర్వాత నితిన్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాలో నటిస్తున్నాడు. దాంతో పాటుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్రాన్ని కూడా మొదలుపెట్టేశాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న సమయంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెల్సిందే. లేదంటే ఈ పాటికి రంగ్ దే విడుదలకు సిద్ధమవుతుండేది. చెక్ కూడా మెజారిటీ భాగం షూటింగ్ ను ముగించుకునేది.

ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా ఈ ఏడాది బాలీవుడ్ హిట్ సినిమా అంధధూన్ రీమేక్ ను చేస్తోన్న విషయం తెల్సిందే. ఇవన్నీ పూర్తయ్యాక నితిన్ ఒక భారీ ప్రాజెక్టును సెటప్ చేసుకున్నాడు. తన స్నేహితుడు, తనతో చల్ మోహన్ రంగ తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ సినిమా చేయనున్నాడు. పవర్ పేట అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మొదలుపెట్టాలని భావించారు. ఈ సినిమా వరకూ అన్నీ భారీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు నితిన్. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఇది రెండు భాగాల సిరీస్ గా తెరకెక్కనుంది. తన సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ తో పాటుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ రెండు సినిమాలను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ మొత్తం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రాజెక్ట్ లాంచ్ కానుంది.