
గత రెండున్నర నెలలుగా కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో 24 క్రాఫ్ట్స్‌కి చెందిన కార్మికులు పని లేకుండా వున్నారు. పని లేకపోవడంతో నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వారి కి అండగా నిలవాలని కరోనా క్రైసిస్ ఫండ్ చారిటి మన కోసం (సీసీసీ) పేరుతో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఓ ఛారిటీని ప్రారంభించారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి, హీరోల వరకు అంతా భారీ స్థాయిలో దీనికి విరాళాలు అందించారు.
దాదాపు 9 కోట్ల వరకు వసూలయ్యాయి. తొలి విడత చిరంజీవి ఓ టీమ్ ని సెట్ చేసి కార్మికుల వద్దకే నిత్యావసరాలని చేరవేసి ఇంటింటికి అందజేశారు. అయితే అందులో కొంత మందికి తొలి విడత నిత్యావసర సరుకులు అందలేదు. కనీసం మలివిడత అయినా అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా సరఫరా చేసిన మలివిడత బంచ్లోనూ సగానికి పైగా కార్మికులకు నిత్యావసరాలు అందకపోవడంతో కార్మికులు తమ యూనియన్ నాయకుల్ని నిలదీయడం గొడవకు దారితీస్తోంది.
తొలి విడతలో కార్లల్లో వచ్చి మరీ నిత్యావసరాలు తీసుకెళ్లారని అందుకే ఈ దఫా చాలా వరకు తగ్గించామని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రతీ సభ్యునికి నిత్యావసరాలు అందాలని, అందని పక్షంలో ఆ విషయాన్ని తనకు తెలియజేయాలని చిరంజీవి ఇటీవల ఓ వీడియోని వదిలారు. దాన్నే ఆధారంగా చేసుకుని కార్మికులు చిరు ఇంటకి వెళ్లి స్వయంగా ఆయననే అడగాలనుకుంటున్నారు. ఇప్పటికే యూనియన్ ఆఫీసుల వద్ద నిరసనకు దిగిన కార్మికులంతా చిరు ఇంటికి దండుగా వెళ్లాలని, ఈ విషయాన్ని ఆయననే అడగాలని నిర్ణయించుకున్నారట.