హిట్ డైరెక్ట‌ర్ శ్ర‌మ ఇన్నాళ్ల‌కు ఫ‌లిస్తోంది!

హిట్ డైరెక్ట‌ర్ శ్ర‌మ ఇన్నాళ్ల‌కు ఫ‌లిస్తోంది!
హిట్ డైరెక్ట‌ర్ శ్ర‌మ ఇన్నాళ్ల‌కు ఫ‌లిస్తోంది!

`Rx100` సినిమాతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఈ సినిమాతో కార్తికేయ‌ని హీరోగా, పాయ‌ల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా నిల‌బెట్టిన ఈ ద‌ర్శ‌కుడు త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావ‌డానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఓ విభిన్న‌మైన క‌థ‌తో ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని చేయాల‌ని గ‌త రెండేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఈ చిత్రానికి `మ‌హా స‌ముద్రం` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ చిత్రాన్నితెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు చేశాడు. ర‌వితేజ హీరోగా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశాడు కానీ కుద‌ర‌లేదు. ఆ త‌రువాత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌రికి వెళ్లింది. అక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు. అజ‌య్ భూప‌తి రెండ‌వ సినిమా చేయ‌డం క‌ష్ట‌మేనా అనేంత‌గా ఈ సినిమా చుట్టూ నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి.

అయితే తాజాగా శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో సినిమా పట్టాలెక్క‌డం ఖాయం అని అర్థ‌మైంది.  `జాను` ఫ్లాప్ కావ‌డంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్తుందా? అని అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే `జాను` ఫ‌లితం కార‌ణంగా శ‌ర్వా త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడ‌ట‌. దీంతో ఇందులో మ‌రో హీరోగా కార్తికేయ‌ని ద‌ర్శ‌కుడు ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. చాలా రోజులుగా ముంందుకు క‌ద‌ల‌ని ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మించ‌బోతున్నారు. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.