మొత్తానికి `వ‌కీల్‌సాబ్‌` టీమ్ బ‌య‌ట‌పెట్టేసింది!

Finally Vakeel saab makers released new poster
Finally Vakeel saab makers released new poster

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్నతాజా చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ చిత్ర `పింక్‌` ఆధారంగా  శ్రీ‌రామ్ వేణు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ చిత్రం ‘పింక్’ అధికారిక రీమేక్ అని చెప్పుకుంటున్న ఈ చిత్రంలో క‌థ‌కు కీల‌క‌మైన మూడు మహిళా పాత్రలు ఉన్నాయి. కానీ మొదటి పాట మినహా మిగతా ప్రమోషన్లు పూర్తిగా పవన్‌కళ్యాణ్‌పైనే కేంద్రీకరించబడ్డాయి.

ఇటీవల విడుదలైన ‘సత్యమేవ జయతే’ పాట కూడా పవన్‌ గురించి, ఆయ‌న పొలిటిక‌ల్ మైలేజీ గురించిఏ రూపొందించిన‌ట్టుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ ఈ చిత్రంలో కీల‌కంగా నిలిచిన ముగ్గురు మ‌హిళా పాత్ర‌ల‌ని పోస్ట‌ర్‌ల‌లో ముందు నుంచి చూపించారు. కానీ తెలుగుకు వ‌చ్చే స‌ర‌నికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ డామినేష‌న్ ఎక్కువైపోయింది. ఆయన పాత్ర గురించే త‌ప్ప మేక‌ర్స్ ఈ క‌థ‌కు కీల‌కంగా వున్న మ‌హిళా పాత్రల‌కు సంబంధించి ఇంత వ‌ర‌కు ఏ ఒక్క పోస్టర్‌ను కూడా మేకర్స్ ఆవిష్కరించలేదు.

దీంతో ఈ చిత్ర బృందంపై గ‌త కొన్ని రోజులుగా నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీంతో  సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా `వ‌కీల్ సాబ్‌` నుంచి సరికొత్త పోస్టర్ ని బ‌య‌టికి వ‌దిలారు. ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన అంజలి, నివేదా థామస్, ‘మల్లెశం’ ఫేమ్ అనన్య నాగ‌ళ్ల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. పవన్ కుర్చీపై కూర్చున్న బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని ఉండ‌గా ఈ ముగ్గురు ఆయ‌న వెన‌కాల నిల్చుని క‌నిపిస్తున్నారు. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కానుంది.