మోస‌గాళ్ల‌తో న‌టీన‌టులు జాగ్ర‌త్త‌!


మోస‌గాళ్ల‌తో న‌టీన‌టులు జాగ్ర‌త్త‌!
మోస‌గాళ్ల‌తో న‌టీన‌టులు జాగ్ర‌త్త‌!

ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీ లో వున్న పెద్ద పెద్ద నిర్మాణ సంస్థ‌లు.. పేరున్న హీరోలు, ద‌ర్శ‌కుల గురించి చెప్పి వారి సినిమాల‌కు, నిర్మాణ సంస్థ‌ల్లో అవ‌కాశాలు ఇస్తామంటూ ఆడిష‌న్ లు నిర్వ‌హించే మోస‌గాళ్లు ఎక్కువైపోయారు. రంగుల ప్ర‌పంచంలోకి ప్ర‌వేశించాల‌ని, త‌మ‌ని తాము వెండితెర‌పై చూసుకుని మురిసిపోవాల‌ని ఎంతో మంది ఆశ‌ప‌డుతుంటారు. అలాంటి వారిని బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పేరుతో క్రేజీ హీరోలా బ్యాన‌ర్స్ పేరుతో కొంత మంది బురిడీ కొట్టిస్తున్నారు.

ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుని వాడుకుని ఫేక్ ఆడిష‌న్‌లు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇది గ‌మ‌నించిన గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు అలాంటిది ఏమీ లేద‌ని, తాము ఆడిష‌న్స్ నిర్వ‌హించ‌డం లేద‌ని స్వ‌యంగా వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. తాజాగా సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పుకుని ఓ నిర్మాణ సంస్థ హీరోయిన్‌ల‌ని సంప్ర‌దించింది. విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో వెంట‌నే రంగంలోకి దిగిన విజ‌య్ టీమ్ త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్రెస్‌నోట్‌ని రిలీజ్ చేయ‌డం తెలిసిందే.

విజ‌య్ పాపులారిటీని క్యాష్ చేసుకోవాల‌ని కొన్ని ఫేక్ సంస్థ‌లు ఆడిష‌న్స్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని, అలాంటి వారిని, ఆ ప్ర‌క‌ట‌న‌ల్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ న‌మ్మ‌వ‌ద్ద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్ మీడియా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స‌ద‌రు సంస్థ కూడా ఇది త‌మ‌కు తెలియ‌కుండా జ‌రిగింద‌ని వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో వివాదం స‌ద్దుమ‌నిగింది. అవ‌కాశాల పేరుతో వ‌లవేసే మోస‌గాళ్ల ఉచ్చులో ప‌డ‌కుండా కొత్త వాళ్లు జాగ్ర‌త్త ప‌డాల‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ టీమ్ ప్ర‌క‌టించింది.