స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299  మాత్రమే


స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299  మాత్రమే
స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299  మాత్రమే

అన్నిటికంటే గొప్ప వ్యాపారం ఏది.?  అని నాలాంటి అమాయకుడు ఒకసారి ప్రపంచాన్ని అడిగాడట..

అప్పుడు ప్రపంచం ఇచ్చిన సమాధానం.

“పంచభూతాలు అయినటువంటి గాలి నేల నీరు నిప్పు ఆకాశం వీటికి సంబంధించిన వ్యాపారం ఏదైనా గాని అద్భుతంగా  ఉంటుంది.”

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ పొందే హక్కు ఉంది.  కానీ అత్యాశతో స్వార్థంతో బతికే కొంతమంది నీచులు సహజ వనరులను తమ గుప్పెట్లో ఉంచుకుని మిగిలిన అటువంటి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు.

అందరికీ అర్థమయ్యేలా ఇలాంటి విషయాలు చెప్పాలని అప్పటికీ మా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ తో జల్సా అనే సినిమా చేశారు.  కానీ పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్ వల్ల అందులో కంటెంట్ జనానికి ఎక్కలేదు.

ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే, దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది.  ఎవడికైనా ఇంకొకరి మీద పగ ఉండి ప్రతీకారం తీర్చుకోవాలి అనిపిస్తే,  ఎక్కువ కష్టపడకుండా ఢిల్లీకి తీసుకెళ్లి ఎటువంటి మాస్కులు లేకుండా ఢిల్లీ వాతావరణంలో పొద్దుటి నుండి నుంచి సాయంత్రం వరకు తిప్పితే మరుసటి రోజుకి ఎవడు అదృష్టం కొద్దీ వాడికి రోగాలు వచ్చి…

అంటే అదే..  ఎందుకులే చెప్తే బాగోదు.

జీవనదులు పారే ఈ దేశంలో మంచినీళ్లు సీసాలో పెట్టి లీటర్ల లెక్కన అమ్ముతూ వచ్చిన మన ఆధునిక సమాజం, ప్రస్తుతం మరొక మెట్టు పైకి ఎక్కింది.  అదే గాలి వ్యాపారం.

దేశ రాజధాని ఢిల్లీలో “ఆక్సి ప్యూర్” అనే పేరుతో ఆక్సీజన్ అమ్మే ఒక దుకాణం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.  ఢిల్లీ పరిధిలోని సాకేత్ అనే ప్రాంతంలో ఉన్న ఈ దుకాణంలో ఆర్య వీరకుమార్ అనే ఒక వ్యక్తి పెట్టిన ఈ దుకాణంలో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన గాలిని 299 రూపాయలు పెట్టి పీల్చుకోవచ్చట.

ఇంకా నీచాతి నీచమైన విషయం ఏమిటంటే, ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ లో ఏడు రకాల ఫ్లేవర్లు కూడా దొరుకుతాయిట.  గాలిలోని నైట్రోజన్ తొలగించడం ద్వారా ఆక్సి ప్యూర్ బార్ లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చని ఈ వ్యాపారవేత్త కొత్త వ్యాపారానికి తెర తీశాడు.

మన చిన్నప్పుడు ఇంటర్నెట్ అంత సులభంగా దొరకని రోజుల్లో పది రూపాయలు పెట్టి 15 రూపాయలు పెట్టి గంటకి ఇంటర్నెట్ కి వెళ్లి పని చూసుకొని వచ్చేవాళ్ళం  కదా. మరి ఇంటర్నెట్ ఇప్పుడు ఉచితంగా లభిస్తుంది. భగవంతుడు ప్రసాదించిన స్వచ్ఛమైన గాలి మాత్రం ఉచితంగా దొరకడం లేదు.  ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా.

ఇప్పుడు స్టైల్ గా జనాలందరూ మంచినీటి సీసాలు చేతిలో పట్టుకుని తిరుగుతున్నట్టు, మరో ఇరవై పాతిక సంవత్సరాలలో జనాలు స్వచ్ఛమైన గాలిని సీసాల్లో నింపుకొని తిరిగితే తప్ప బతకలేని పరిస్థితి వస్తుంది అని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది.