
దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన చిత్రం `బాహుబలి`. ఈ సినిమా తరువాత దర్శకుడిగా రాజమౌళి స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా చిత్రాల దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. `బాహుబలి` తరువాత ఆయన నుంచి వస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తొలి సారి కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాని భారీ రేంజ్లో రాజమౌళి తెరపైకి తీసుకొస్తున్నారు.
ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట మోధుడు కొమరం భీంగానూ, రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగాను నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు అలియాభట్, అజయ్ దేవ్గన్తో పాటు సముద్రఖని, హాలీవుడ్ నటులు రే స్టీవెన్సన్, ఒలివియా మోరీస్, అలీసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరకు వ్యాలీలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం జక్కన్న మరో సర్ప్రైజ్ని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో `పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా వీర తెలంగాణమా..` అంటూ హుషారెత్తించే గీతంతో పాటు పలు ఉత్తేజకర గీతాల్ని ఆలపించిన గద్దర్ ఉద్యమానికి తన వంతు పాత్రని పోషించారు.
అలాంటి గద్దర్ చేత ఓ ఫెరోషియస్ గీతాన్నిరాయించి కొమరం భీం పాత్రధారి ఎన్టీఆర్ పై చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటని స్వయంగా గద్దరే పాడబోతున్నట్టు తెలిసింది. ఈ పాట సినిమాలో వచ్చే కీలక ఘట్టంలో వస్తుందని, ఎమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లి సినిమాకు హైలైట్‌గా నిలుప్తుందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. హాలీవుడ్ ఫిల్మ్ `మోటర్ సైకిల్ డైరీస్` స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.